ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రి ఎస్‌ఎన్‌సీయూ (SNCU) వార్డులో సంభవించిన ఘోర అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. ప్రమాద సమయంలో తీవ్రగాయాల పాలై, మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించబడిన మరో పసిపాప చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూసింది. పసికందులు వరుసగా ప్రాణాలు కోల్పోతుండటం బాధితులతో పాటు స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది.
ప్రమాద సమయంలో ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహించారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ‘ఇంత పెద్ద ఆస్పత్రిలో అత్యవసర సమయంలో పర్యవేక్షించడానికి ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నాడా?’ అంటూ సదరు తండ్రి వైద్యాధికారుల తీరుపై నిలదీశాడు. ఆస్పత్రిలో తగినంత మంది వైద్యులు, సిబ్బంది లేకపోవడం వల్లే అత్యవసర సమయాల్లో చిన్నారులను రక్షించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

‘సార్.. నా కడుపుకోత తీర్చేది ఎవరు?’
ఈ దుర్ఘటనలో తన ఐదు రోజుల పాపను కోల్పోయిన ఒక నిరుపేద తండ్రి ఆదిలాబాద్ కలెక్టర్ ఎదుట కన్నీటిపర్యంతమయ్యాడు. ‘సార్.. నా కడుపుకోత తీర్చేది ఎవరు? నా ఐదు రోజుల బిడ్డ చనిపోయింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్?’ అంటూ కలెక్టర్ ముందు విలపిస్తూ తన ఆవేదనను వెళ్లగక్కాడు. ఆస్పత్రిలో ఐసీయూ స్థాయిలో సేవలు అందాల్సిన విభాగంలో ఇతర చిన్నారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయాడు.
ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత, ఆందోళన నెలకొన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు భారీ పరిపరిహారం అందించి న్యాయం చేయాలని స్థానిక ప్రజాసంఘాలు, నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.








