తెలంగాణ

వరంగల్ ఎంజీఎంలో ఊడిన పెచ్చులు.. నిరసనకు దిగిన మాజీ ఎమ్మెల్యేపై పోలీసుల దాష్టీకం!

రచన: Mamatha puppala3 నిమిషాల పఠనం

వరంగల్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆసుపత్రి వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆసుపత్రిలోని ఆర్‌ఐసీయూ (RICU), ఫిజియోథెరపీ విభాగాల్లో పైకప్పు పెచ్చులు ఊడిపడిన ఘటన తీవ్ర ఆందోళన రేకెత్తించింది.

 వరంగల్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆసుపత్రి వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆసుపత్రిలోని ఆర్‌ఐసీయూ (RICU), ఫిజియోథెరపీ విభాగాల్లో పైకప్పు పెచ్చులు ఊడిపడిన ఘటన తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఆ సమయంలో రోగులు, సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినప్పటికీ, ప్రభుత్వ ఆసుపత్రులలో భద్రతా లోపాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల పరిస్థితిని, ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించేందుకు వచ్చిన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర నెట్టివేత, తోపులాట జరిగింది. నిరసన సందర్భంగా పోలీసులు తనను కడుపులో తన్నారని, దాడిలో చెయ్యి విరిగిపోయిందని వినయ్ భాస్కర్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

 మరోవైపు, ఆసుపత్రిలో జరుగుతున్న లోపాలు బయటకు రాకుండా చూసేందుకు ఎంజీఎం పరిసరాల్లో పోలీసు యంత్రాంగం కఠిన ఆంక్షలు విధించింది. మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించకుండా ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నిరసనకు దిగిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.

 వరుస ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం, ఆసుపత్రి యాజమాన్యం పట్టించుకోవడం లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. కాగా, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌పై పోలీసుల ప్రవర్తనను బీఆర్‌ఎస్ నాయకత్వం తీవ్రంగా ఖండించింది.

#WarangalMGMHospital#DasyamVinayBhaskar#BRSProtest#MGMHospitalRoofCollapse#WarangalNews#PoliceHighhandedness#TelanganaHealthSector#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి