తెలంగాణ

Telangana Congress: రూల్స్ సీఎంకేనా పీసీసీకి వర్తించవా?.. కాంగ్రెస్ అంతర్గత పోరులో కొత్త లొల్లి!

రచన: Mahesh6 నిమిషాల పఠనం

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత కుమ్ములాటలు భగ్గుమన్నాయి. "మాట ఒకటే.. సబ్జెక్ట్ ఒకటే.. కానీ ఒకరు మాట్లాడితే తప్పట, మరొకరు మాట్లాడితే ఒప్పా?" అంటూ హస్తం శ్రేణుల్లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది.

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత కుమ్ములాటలు భగ్గుమన్నాయి. "మాట ఒకటే.. సబ్జెక్ట్ ఒకటే.. కానీ ఒకరు మాట్లాడితే తప్పట, మరొకరు మాట్లాడితే ఒప్పా?" అంటూ హస్తం శ్రేణుల్లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. మొన్న సీఎం రేవంత్ రెడ్డి పరకాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేను గెలిపించాలని కోరితే కాంగ్రెస్ సంస్కృతికి విరుద్ధమంటూ హడావుడి చేసిన పీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్.. ఇప్పుడు స్వయంగా తనే పోటీ చేస్తానని ముందస్తుగా ప్రకటించుకోవడం గాంధీభవన్‌లో సరికొత్త మంటలు రేపుతోంది.

సీఎం అంటే రచ్చ.. పీసీసీ అంటే ఓకేనా

కొద్దిరోజుల క్రితం పరకాల పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. దీనిపై కాంగ్రెస్‌లోని ఓ వర్గం తీవ్ర దుమారం రేపింది. "ఎన్నికలకు ముందే అభ్యర్థిని ప్రకటించే హక్కు సీఎంకు ఎక్కడిది? కాంగ్రెస్ పద్ధతి ఇది కాదు" అంటూ పెద్ద పంచాయితీ పెట్టారు. అది చిలికి చిలికి గాలివానలా మారి ఏకంగా మంత్రి వర్గం వరకు చర్చకు దారితీసింది.

ఆ సమయంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో మహేష్ కుమార్ గౌడ్ సైతం ఆ అభ్యంతరాలకు వత్తాసు పలికేలా ప్రకటనలు చేశారు. పార్టీలో ఎవరు ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించినా అది చెల్లదని తేల్చి చెప్పారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మాటలకు పీసీసీ చీఫ్ బ్రేక్ వేశారంటూ విస్తృతంగా ప్రచారం సాగింది.

నిజామాబాద్ నుంచి పోటీపై మహేష్ గౌడ్ ప్రకటన

ఇటీవల పీసీసీ అధ్యక్షుడిగా తన పదవీకాల పురోగతిపై నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా ఓ ఆసక్తికర ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రత్యక్ష బరిలో దిగుతానని స్పష్టం చేశారు. ఏ నియోజకవర్గం అన్నది త్వరలో చెబుతానని దాటవేశారు.

ఈ ప్రకటన వెలువడటమే ఆలస్యం.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లయింది. ఎందుకంటే మహేష్ గౌడ్‌కు జిల్లాలో నిర్దిష్టమైన సొంత నియోజకవర్గం అంటూ ఏదీ లేకపోవడమే.

ప్రస్తుతం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పటిష్టమైన ఇన్-ఛార్జ్‌లు పని చేస్తున్నారు. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు జిల్లాలోకి ఎంట్రీ ఇస్తే తమ సీటు ఎక్కడ ఊడిపోతుందోనని స్థానిక ముఖ్య నేతల్లో గుబులు మొదలైందని సమాచారం.

గతంలో ఆయన ఆర్మూర్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా, తాజా ప్రకటనతో జిల్లా కాంగ్రెస్ కేడర్‌లో గందరగోళం పెరిగిందని చెబుతున్నారు.

రివర్స్ ఎటాక్‌లో రేవంత్ వర్గం

మహేష్ కుమార్ గౌడ్ ప్రకటనపై సీఎం రేవంత్ రెడ్డి వర్గం, నిజామాబాద్ జిల్లా స్థానిక నాయకత్వం గట్టిగానే కౌంటర్ ఇస్తున్నాయి. "పరకాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేను మళ్లీ గెలిపించమంటే అధిష్ఠానం, రూల్స్ గుర్తుకొచ్చిన పీసీసీ అధ్యక్షుడికి.. ఇప్పుడు తన సొంత సీటు విషయంలో ఆ సంస్కృతి గుర్తుకురాలేదా? ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తన సీటును తానే ముందే ఎలా ప్రకటించుకుంటారు?" అంటూ నిలదీస్తున్నారు.

ఒకరి ప్రకటన వివాదాస్పదమైతే, అదే స్థాయి నాయకుడి ప్రకటన సైతం పార్టీలో క్రమశిక్షణ లైన్‌ను దెబ్బతీస్తోందన్న చర్చ ఇప్పుడు ఊపందుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మధ్య అంతర్గతంగా నడుస్తున్న ఈ సైలెంట్ వార్ కాంగ్రెస్ వర్కింగ్ కల్చర్‌లోని వైరుధ్యాలను మరోసారి బహిర్గతం చేస్తోందన్న విమర్శలు సైతం వెలువడుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ ప్రకటన గాంధీభవన్‌లో ఇంకెన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.

#Telangana Congress#Congress#Telangana Politics#TG Politics#Mahesh Kumar Goud#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి