శ్రీవారి దర్శనం కోసం మెట్ల మార్గంలో వెళ్తున్న భక్తులకు 2800 మెట్టు సమీపంలో ఉన్న చెట్టుపై చిరుత కనిపించింది. ఆ చిరుతను గుర్తించిన భక్తులు భయంతో పరుగులు తీశారు. వెంటనే టీటీడీ విజిలెన్స్, అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత అప్పటికే చెట్టుపై నుంచి దిగి అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం దాని కదలికలను గుర్తించి అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
మరోవైపు తిరుమల నడకమార్గంలో చిరుత కనిపించడం ఇదే తొలిసారి కాదు. ముఖ్యంగా 2023లో వరుస ఘటనలు తీవ్ర ఆందోళన కలిగించాయి. అదే ఏడాది జూన్‌లో అలిపిరి ఏడో మైలు ప్రాంతంలో మూడేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసింది. ఆ తర్వాత ఆగస్టు 2023లో ఆరేళ్ల బాలిక లక్షిత చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనల తర్వాత టీటీడీ, అటవీశాఖ కలిసి నడకమార్గంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. కెమెరా ట్రాప్స్, నిఘా కెమెరాలు, భద్రతా సిబ్బంది, భక్తులను గుంపులుగా పంపించే విధానం వంటి చర్యలు చేపట్టారు.
2025లో కూడా అలిపిరి మెట్లమార్గం, ఘాట్ రోడ్ల పరిసరాల్లో వన్యప్రాణుల కదలికలపై టీటీడీ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించింది. అటవీ ప్రాంతంలో ఆహార వ్యర్థాలు వన్యప్రాణులను ఆకర్షించడం కూడా ఒక కారణంగా అధికారులు గుర్తించారు. ఇక ప్రస్తుతం తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 22న ఎనిమిదో రోజు ఉదయం మహా రథోత్సవం జరిగింది.
రాత్రి అశ్వవాహన సేవతో ఎనిమిదో రోజు వాహన సేవలు ముగియనున్నాయి. సెప్టెంబర్ 23న చక్రస్నానం, అనంతరం ధ్వజావరోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇలా ఒకవైపు గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగుతుంటే.. మరోవైపు అదే కొండల్లో వన్యప్రాణుల సంచారం భక్తుల భద్రతకు సవాల్‌గా మారుతోంది. అందుకే అలిపిరి నడకమార్గంలో వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచిస్తోంది.
భక్తులు ఒంటరిగా కాకుండా గుంపులుగా ప్రయాణించడం, ముఖ్యంగా చిన్నారుల విషయంలో మరింత జాగ్రత్త వహించడం.. అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించడం అత్యంత కీలకంగా మారింది.










