Jurala Project: రాష్ట్రంలో సాగునీరు, తాగునీటి ఎద్దడిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రైతుల సమస్యలను పరిష్కరించడం కంటే, వాటిని రాజకీయం చేయడానికే బీఆర్‌ఎస్ ఎక్కువ ప్రాధాన్యమిస్తోందంటూ మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు వద్ద గులాబీ నేతలు చేస్తున్న హడావుడిని ఎండగడుతూ మంత్రి జూపల్లి సంధించిన ప్రశ్నలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
కాళ్లు పట్టుకోవడానికైనా సిద్ధం: మంత్రి జూపల్లి
తెలంగాణలో అన్నదాతల ప్రయోజనాల కోసం తాము ఎంతవరకైనా వెళ్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు కుండబద్దలు కొట్టారు. "కర్ణాటక ప్రభుత్వ కాళ్లు పట్టుకోవాలని బీఆర్‌ఎస్ నేతలు హేళనగా మాట్లాడుతున్నారు. అవును.. రాష్ట్ర రైతాంగం కోసం, సాగునీటి అవసరాల కోసం పక్క రాష్ట్రం కాళ్లు మొక్కినా ఎలాంటి తప్పులేదు" అని ఆయన ఘాటుగా బదులిచ్చారు. ఇప్పటికే నీటి విడుదల విషయమై కర్ణాటక సీఎంతో మాట్లాడుతున్నామని, ఆయనకు అధికారికంగా లేఖ కూడా రాశామని వెల్లడించారు.
తాము ఎలాగైనా కర్ణాటక నుంచి నీళ్లు తీసుకొస్తామనే విషయం ముందే గ్రహించి, ఆ క్రెడిట్ కాంగ్రెస్‌కు దక్కకూడదనే ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు మైలేజ్ కోసం రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. గత పదేళ్ల పాలనలో జూరాలలో పూడిక తీయని పాపం వారిదేనని, ఇప్పుడు ఏర్పడిన ఎల్‌నినో పరిస్థితులను అధిగమించడానికి సలహాలు ఇవ్వాల్సింది పోయి అవకాశవాద రాజకీయాలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.
అన్నదాతలకు మరణశాసనం రాసింది మీరే: మంత్రి వాకిటి
మరోవైపు మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. జూరాల వద్ద బీఆర్‌ఎస్ నేతల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వలు ఎంత ఉన్నాయి? తాగునీటి కోసం ఎంత కేటాయించాలనే కనీస అవగాహన లేకుండా గులాబీ పార్టీ నాయకులు రైతులను భయాందోళనలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాడు కృష్ణా జలాల్లో 811 టీఎంసీలకు గాను కేవలం 299 టీఎంసీలకు అంగీకరించి తెలంగాణ రైతులకు మరణశాసనం రాసింది కేసీఆర్ సర్కార్ కాదా అని ఆయన నిలదీశారు. నీటి కేటాయింపుల్లో రాష్ట్రాన్ని దగా చేసిన గత పాలకులకు పాలమూరు గురించి, రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం, వ్యవసాయంపై పేటెంట్ హక్కు ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదేనని తేల్చిచెప్పారు.









