తెలంగాణ

Telangana: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్!..

రచన: Venu4 నిమిషాల పఠనం

భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. హైదరాబాద్‌ పరిధిలోని మూడు మున్సిపల్‌ కార్పొరేషన్ల కమిషనర్లు, హైడ్రా, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఒకవైపు ఉక్కపోత.. మరోవైపు ఒక్కసారిగా కురుస్తున్న వర్షాలు.. తెలంగాణలో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాష్ట్రంపై ప్రభావం చూపుతోంది. దీంతో వాతావరణ శాఖ పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.

బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో 20.4 సెంటీమీటర్లకు పైగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండటంతో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. మరికొన్ని జిల్లాల్లో 11.5 నుంచి 20.4 సెంటీమీటర్ల వరకు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

ఈ క్రమంలో బుధవారం పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌ సహా పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.. ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ అయింది.

గురువారం కూడా కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ కొనసాగనుంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

వాయుగుండంతో పాటు కర్ణాటక, కోస్తాంధ్ర మీదుగా ద్రోణి కొనసాగుతుండటంతో వర్షాల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లోనూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఇప్పటికే మంగళవారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఖైరతాబాద్‌లో 3.2 సెంటీమీటర్లు, కూకట్‌పల్లిలో 2.8, ముషీరాబాద్‌లో 2.5, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 2.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. హైదరాబాద్‌ పరిధిలోని మూడు మున్సిపల్‌ కార్పొరేషన్ల కమిషనర్లు, హైడ్రా, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రధాన రహదారులు, జంక్షన్లు, కాలనీల్లో నీరు నిలిచిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

#Telangana#Hyderabad#Red alert#districts#Meteorological Department#Wednesday#Thursdays
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి