Iran Crisis: దశాబ్దాల పాటు చమురు సంపదతో తులతూగిన గల్ఫ్ దేశం ఇరాన్‌లో ఇప్పుడు మానవతా సంక్షోభం పరాకాష్టకు చేరింది. యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ ఆంక్షలు, స్థానిక కరెన్సీ ‘రియాల్’ పతనం అన్ని కలిపి దేశాన్ని ద్రవ్యోల్బణ విషవలయంలోకి నెట్టేశాయి. ఒకప్పుడు పెట్రో-డాలర్లతో విర్రవీగిన నేలపై.. ఇప్పుడు ప్రజలు పూట గడవడం కోసం తీవ్రంగా పోరాడాల్సి వస్తోంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో సాధారణ మధ్యతరగతి కుటుంబాలు సైతం దారిద్య్రరేఖకు దిగువకు జారుకుంటున్నాయి.
ఆహార ద్రవ్యోల్బణం 128 శాతం
ఇరాన్‌లో వార్షిక ద్రవ్యోల్బణం 57 నుంచి 68 శాతానికి చేరగా, ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం ఏకంగా 128 శాతాన్ని తాకింది. నిన్నటి రేటు నేటికి ఉండకపోవడంతో మార్కెట్‌కు వెళ్లిన ప్రతిసారీ సామాన్యుడి జేబులు గుల్లవుతున్నాయి.
అత్యంత దారుణంగా వంట నూనెలు, ఫ్యాట్స్ ధరలు 261% నుంచి 383% వరకు పెరిగిపోయాయి. ఒక్క లీటరు నూనె కొనడానికే సామాన్యుడు రోజువారీ సంపాదనలో పెద్ద మొత్తాన్ని వెచ్చించాల్సి వస్తోంది.
గుడ్ల ధరలు 294%, చికెన్ ధరలు 177% పెరిగాయి. ఒక ట్రే గుడ్ల ధర లక్షల రియాల్స్‌కు చేరడంతో సాధారణ కుటుంబాలకు గుడ్డు కూడా అందని ద్రాక్షగా మారింది. రెడ్ మీట్ (మటన్, బీఫ్) ధరలు 148% కంటే ఎక్కువ పెరగడంతో దేశంలో మాంసాహార యూజ్ ఏకంగా సగానికి పడిపోయింది. కనీస ఆహారమైన పాలు, డైరీ ఉత్పత్తులు 147% పెరగ్గా.. నిత్యం తినే బియ్యం, బ్రెడ్ ధరలు 116% పైగా పెరిగాయి.
సంపాదన రూ. 20 వేలు.. బతకడానికి లక్ష కావాలి
ఆదాయానికి, ఖర్చులకు మధ్య ఏమాత్రం పొంతన లేకుండా పోవడంతో ఇరాన్ ప్రజలు తీవ్ర అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం కేవలం తినడానికి, జీవితం గడపడానికి (ఇంటి అద్దె మినహాయించి) నెలకు కనీసం $1,159 (దాదాపు రూ.96,000 పైగా) అవసరమవుతున్నాయి.
ఒక ఒంటరి వ్యక్తికి సైతం నెలకు సుమారు $308 (రూ.25,000 - రూ.31,000) దాకా ఖర్చవుతోంది. ఇరాన్‌లో ఒక కార్మికుడి కనీస వేతనం నెలకు కేవలం $244 (దాదాపు 166 మిలియన్ రియాల్స్). మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల సగటు వేతనం 104 డాలర్లకు పడిపోయింది. నెలకు వచ్చే జీతానికి, అయ్యే ఖర్చుకు దాదాపు నాలుగు రెట్ల వ్యత్యాసం ఉండటంతో దేశ జనాభాలో అత్యధిక భాగం అర్ధాకలితో అలమటిస్తోందనే నివేదికలు వెల్లువెత్తున్నాయి.
పెట్రోల్ కొరత నుంచి ఆకలి సంక్షోభం దాకా..
ఇప్పటికే రిఫైనరీలు దెబ్బతిని చమురు ఉత్పత్తి 26 శాతం పడిపోవడంతో దేశంలో పెట్రోల్ కొరత తీవ్రమైంది. నెలకు 110 లీటర్లు దాటితే డబుల్ రేటు విధించడం, యూనివర్సిటీలను బంద్ చేసి ఆన్‌లైన్ క్లాసులు నడపడం, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం వంటి చర్యలు పాలనా వ్యవస్థ వైఫల్యాన్ని బయటపెట్టాయి.
కరెన్సీ విలువ పతనమై ప్రతిరోజూ మార్కెట్లో ప్రైస్ ట్యాగ్‌లు మారిపోతుండటంతో జనం తమ ఆహారపు అలవాట్లను బలవంతంగా మార్చుకుంటున్నారు. యుద్ధం తెచ్చిన ఆంక్షలు, అంతర్గత అవినీతి కలగలిసి ఒక సంపన్న ముడి చమురు దేశాన్ని నిస్సహాయంగా ఆకలి కేకల నిలయంగా మార్చివేశాయి. తక్షణమే అంతర్జాతీయ సాయం అందకపోతే రాబోయే రోజుల్లో ఇరాన్‌లో పరిస్థితులు మరింత దయనీయంగా మారే ప్రమాదం పొంచి ఉందనే విశ్లేణలు అందుతున్నాయి.












