Tirumala Hundi Income: హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో కొండకు వస్తారు. స్వామి వారిని కనులారా దర్శించుకుని పులకించిపోతారు.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ మొక్కులు సమర్పించుకుంటారు. ఇందులో భాగంగా తమకు చేతనైన మొత్తాన్ని హుండీలో కానుకగా వేస్తారు. దీంతో రోజూ శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం వస్తోంది. తాజాగా శ్రీవారికి రికార్డు స్థాయి హుండీ ఆదాయం సమకూరింది. ఏకంగా రూ.140.28 కోట్లు ఆదాయం వచ్చింది. ఒక్క జూలై నెలలోనే ఈ ఆదాయం వచ్చింది. ఈ విషయాన్ని టీటీడీ అధికారులు తెలిపారు.
కాగా, టీటీడీ చరిత్రలో ఒక నెలలో ఇంత ఆదాయం నమోదవడం ఇది రెండోసారి అని టీటీడీ తెలిపింది. 2022 ఆగస్టు నెలలో 140.34 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. కరోనా తర్వాత ప్రతి నెల 100 కోట్లకు పైగా హుండీ ఆదాయం లభిస్తోందని టీటీడీ అధికారులు తెలిపారు.
జూలై నెలలో భక్తులు భారీ సంఖ్యలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. 24.52 లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని టీటీడీ తెలిపింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందని అధికారులు పేర్కొన్నారు. సెలవులు, శుభ ముహూర్తాలు, వీకెండ్స్ కలిసి రావడంతో జూలై నెల మొత్తం తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగింది.












