నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు యవత పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. పార్లమెంట్ మార్చ్, జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలుపుతున్న సమయంలో పలు హింసాత్మక ఘటనలు నెలకొన్నాయి. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. పలువురు విద్యార్థులు గాయపడగా.. ఒక విద్యార్థిని చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.విద్యార్థులపై కేసులు కూడా నమోదయ్యాయి. దీనిమీద సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు సైతం జారీ చేసింది. నేరచరిత్రలేని వారిని మైనర్లు అందరినీ విడుదల చేయాలని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది.
ఇదిలాఉండగా, బెంగాల్‌లో ఇటీవల ఓ ఉగ్రవాద అనుమానితుడు హమీమ్ మొండల్ అరెస్టు అయ్యాడు. అతడు బెంగాల్ సీఎం సువేందు అధికారిని లక్ష్యంగా చేసుకోవడంతో పాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన జేఏసీ నిరసనల్లోకి చొరబడేందుకు కుట్ర పన్నినట్టు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) తెలిపింది. పాక్‌కు చెందిన జైషే మహమ్మద్ టెర్రరిస్టు సంస్థతో అతనికి సంబంధాలు ఉన్ననట్టు పోలీసులు తేల్చారు.కాగా, హమీమ్‌ను రెండురోజుల క్రితం పూర్బా బర్ధమాన్ జిల్లాలో ఎస్‌టీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
ఎస్‌టీఎఫ్ ఐజీ గౌరవ్ శర్మ మీడియాకు వివరాలు వెల్లడించారు. పాక్ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు హమీమ్ పోలీసు యూనిఫాం ధరించి ఢిల్లీలోని జంతర్ మంతర్ విద్యార్థి నిరసన ప్రదేశంలోకి ప్రవేశించి అలజడి సృష్టించాలని పథకం రచించినట్లు వెల్లడించారు.దీనికి తోడు బెంగాల్ సీఎం కదలికలపై నిఘా ఉంచాలని, సమాచారం చేరవేయాలని హమీమ్‌కు పాక్‌లోని టెర్రర్ గ్రూపులు ఆదేశాలు ఇచ్చినట్టు విచారణలో తేలిందన్నారు. కాగా, ప్రస్తుతం కోర్టు అతనికి 14 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది.
ఇదిలాఉండగా, నిందితుడు హమీమ్ ప్రియురాలు అర్పితా సర్కార్‌ను సైతం జార్ఖండ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ కలసి బెంగాల్ మినిస్టర్ ఉమేష్ రే కొడుకుని హనీట్రాప్ ద్వారా కిడ్నాప్ చేసి డబ్బులు గుంజాలని ప్లాన్ చేసినట్టు ఎస్టీఎఫ్ ఐజీ తెలిపారు. అర్పిత ప్రముఖులు, పొలిటికల్ లీడర్స్‌ను హనీట్రాప్ చేసి ఆ సమాచారం హమీమ్‌కు చేరవేసేదని, ఆమె వాట్సాప్ చాట్స్‌లో పాక్ లింకులు బయటపడ్డాయని వెల్లడించారు.












