Amit Tiwari: కాక్రోచ్ జనతా పార్టీతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు అభిజిత్ దీప్కే. నీట్ పేపర్ లీక్ అంశంలో యువత మద్దతుతో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి తేవడంలో సక్సెస్ అయ్యాడు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో అభిజిత్ దీప్కే పేరు ఒక్కసారిగా మార్మోగిపోతోంది. అయితే, ఆయన చుట్టూ పలు వివాదాలు అలుముకుంటున్నాయి. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి అభిజిత్ దీప్కేకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది.
ఈ మేరకు సూరత్ కి చెందిన యాక్టివిస్ట్ అమిత్ తివారీ ఆర్టీఐని కోరారు. రిటైర్డ్ ఉద్యోగి అయిన తండ్రి భగవాన్ రావ్.. తన కుమారుడి చదువు కోసం డబ్బులు ఎలా సమకూర్చారో విచారించాలన్నారు. సీజేపీ ఫండ్ రైజింగ్, సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ ప్రకటించిన కోటి రూపాయల లీగల్ డిఫెన్స్ పైనా విచారణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు పన్నుల శాఖకు లేఖ రాశారు అమిత్ తివారీ.
"భగవాన్ రావు జీతం రూ. 60వేల నుంచి 65వేలు మాత్రమే ఉన్నప్పుడు, అమెరికాలో తన పిల్లల చదువుకు అయ్యే ఖర్చును ఎలా భరించగలిగారు?" అని సూరత్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త ప్రశ్నించారు. 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తండ్రి భగవాన్‌రావు దిప్కే ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరపాలని ఆయన కోరారు. భారత ఎన్నికల సంఘం (ECI), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC), మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశానని అమిత్ తివారీ తెలిపారు. CJP చట్టపరమైన హోదా, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ప్రకటించిన కోటి రూపాయల నిధి , భగవాన్‌రావు దిప్కే ఆర్థిక ఆస్తుల విషయంలో తివారీ పలు ప్రశ్నలను లేవనెత్తారు.
"నేను మూడు వేర్వేరు చోట్ల ఫిర్యాదులు చేశాను. ECI (భారత ఎన్నికల సంఘం) వద్ద CJPపై ఫిర్యాదు చేశాను. అలాగే, కపిల్ సిబల్ సమకూర్చిన రూ. 1 కోటి నిధిపై 18% GST విధించాలని కోరుతూ CBIC (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్)కు ఫిర్యాదు చేశాను" అని తివారీ వివరించారు.
మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (MIDC)లో జూనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న భగవాన్‌రావు దీప్కే ఆస్తులపై విచారణ జరపాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆశ్రయించినట్లు తివారీ తెలిపారు. "MIDCలో జూనియర్ ఇంజనీర్‌గా ఉన్న భగవాన్‌రావు గురించి నేను మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేశాను. అతను నెలకు రూ. 60,000 నుండి రూ. 65,000 జీతం పొందుతుండగా, అమెరికాలో తన పిల్లల చదువు ఖర్చులను ఎలా భరించగలిగారు?". "ఇది ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారమైతే, దీనిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాము" అని తివారీ పేర్కొన్నారు.
CJPపై తాను చేసిన ఫిర్యాదు గురించి తివారీ స్పందించారు. ఆ సంస్థ ఎలాంటి అధికారిక నమోదు (రిజిస్ట్రేషన్) లేకుండానే విరాళాలు స్వీకరిస్తూ ఒక రాజకీయ పార్టీలా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. "CJPపై ఫిర్యాదు విషయానికొస్తే, వారు రాజకీయ పార్టీలా వ్యవహరిస్తూ, నమోదు కాకుండానే విరాళాలు స్వీకరిస్తుంటే, 'ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951'లోని సెక్షన్ 29A కింద తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు కాకుండానే కోటి రూపాయల నిధులను స్వీకరిస్తున్నందున, వారిపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేశాము" అని తివారీ చెప్పారు.












