రాష్ట్రంలో మరోసారి అలజడి నెలకొన్నది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని బహదూర్ గూడలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది.ఆదివారం ఉదయం శంషాబాద్ పోలీసులు గ్రామానికి చేరుకుని రిలే దీక్షలు చేస్తున్న రైతులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ముందస్తు అనుమతి లేకుండా దీక్షలు ఎలా చేస్తారంటూ అన్నదాతలను ప్రశ్నించారు. శంషాబాద్ సీఐ, పలువురు ఎస్ఐలు, సిబ్బంది గ్రామానికి చేరుకొని రిలే దీక్షల కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపివేశారు.
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం తమ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటున్నదని.. భూములు ఇవ్వడం తమకు ఇష్టం లేదని రైతులు నిరసనలు తెలుపుతున్నారు.ఈ విషయంలో చాలా రోజులుగా లక్ష్మీ తండా వాసులు నిరసన దీక్షలు చేస్తున్నారు. ఇటీవల హైడ్రా ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖలతో కలిసి సుమారు 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని అధికారులు ఫెన్సింగ్ వేసిన విషయం తెలిసిందే.
దాన్ని వ్యతిరేకిస్తూ మూడు రోజులుగా బహదూర్ గూడకు చెందిన రైతులు గ్రామంలోని చవిడి వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆదివారం ఉదయం నిరసనలు తెలుపుతున్న ప్రాంతానికి చేరుకుని రైతులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీక్షలకు అనుమతి లేదని వెంటనే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలని రైతులకు చెప్పారు.
దీంతో అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం సరికాదని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.బలవంతంగా తమ భూములను సర్కారు లాక్కున్నదని, పరిహారం కూడా చెల్లించలేదని అన్నదాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












