మనిషి జీవితంలో మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. అలాగే ఎలాంటి హెచ్చరిక లేకుండా ప్రమాదం ఏ వైపు నుండి వస్తుందో అర్థం కాదు.. ఈ రెండూ.... రోజు, సమయం చెప్పి రావు.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి.. ఇక తాజాగా పెరూలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. నాజ్కా నగర సమీపంలో పర్యాటకులతో వెళ్తున్న విమానం కుప్పకూలడంతో 13 మంది దుర్మరణం పాలయ్యారు.
ఈ విషయాన్ని ఆ దేశ రవాణా, సమాచార మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. ప్రమాదానికి గురైన విమానం పెరూలోని ప్రపంచ ప్రఖ్యాత నాజ్కా లైన్స్ సందర్శన కోసం బయలుదేరింది. ప్రమాద సమయంలో విమానంలో 11 మంది విదేశీ పర్యాటకులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. అయితే ఈ విషాద ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు.
సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అలాగే ప్రమాదానికి గల కారణాన్ని నిర్ధారించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఏవియేషన్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ కమిషన్ దర్యాప్తు ప్రారంభినట్టు అధికారులు తెలిపారు. ఇక ఈ ఘటనతో పెరూ దేశం విషాదంలో మునిగిపోయింది.
మరోవైపు ప్రమాదానికి గురైన విమానాన్ని సెస్నా కారవాన్ C-208 ఫ్లైట్‌గా అధికారులు గుర్తించారు. ప్రత్యేక పర్యాటక విమానాలను నడిపే ఏరోడియానా అనే ఎయిర్ లైన్స్ కంపెనీ ఈ విమానాన్ని నడుపుతున్నట్లు పెరూ రవాణా, సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది.
టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ప్యూబ్లో నుయెవో జిల్లాలోని సోకోస్ సమీపంలో ఏటీసీతో విమానం సంబంధాలు కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే నాజ్కా నగర సమీపంలో ఫ్లైట్ క్రాష్ అయ్యిందని అధికారులు తెలిపారు..












