తెలంగాణ

Karimnagar: ఖాకీ వనంలో.. కలుపు మొక్కలు!

రచన: Venu6 నిమిషాల పఠనం

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థ... నేరాలను అడ్డుకోవాల్సిన అధికారులు.. అదే వ్యవస్థలో కొందరు వ్యక్తులపై వరుసగా నమోదవుతున్న కేసులు సమాజంలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఒకవైపు నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్న వేలాది మంది పోలీసు సిబ్బంది ఉన్నప్పటికీ.. మరోవైపు కొందరు అధికారుల చర్యలు మొత్తం శాఖ ప్రతిష్ఠను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.

చట్టం అంటే ప్రజలకు భరోసా.. ఆ భరోసాకు ప్రతీక పోలీసు వ్యవస్థ. కానీ అదే వ్యవస్థలో వరుసగా వెలుగులోకి వస్తున్న కొన్ని ఘటనలు ఇప్పుడు ఆ నమ్మకాన్నే ప్రశ్నిస్తున్నాయి. గంజాయి కేసులో కానిస్టేబుల్ అరెస్ట్, అత్యాచార కేసులో ఎస్సై జైలుకు, అక్రమ వసూళ్లు, నకిలీ జీతాల కుంభకోణం, అధికార దుర్వినియోగం ఆరోపణలు.. ఇవన్నీ విడివిడిగా కనిపించే సంఘటనలు కాదు. పోలీసు వ్యవస్థలో జవాబుదారీతనం, అంతర్గత పర్యవేక్షణ వంటి అంశాలపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థ... నేరాలను అడ్డుకోవాల్సిన అధికారులు... అదే వ్యవస్థలో కొందరు వ్యక్తులపై వరుసగా నమోదవుతున్న కేసులు సమాజంలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఒకవైపు నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్న వేలాది మంది పోలీసు సిబ్బంది ఉన్నప్పటికీ... మరోవైపు కొందరు అధికారుల చర్యలు మొత్తం శాఖ ప్రతిష్ఠను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.

పోలీస్ వ్యవస్థలో కొన్ని చోట్ల ప్రతి కేసులో ఇరువర్గాల నుంచి లాభం పొందాలనే ధోరణి పెరుగుతోందనే ప్రచారాలు ఉన్న నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణా, గుట్కా స్మగ్లింగ్, బెల్ట్ షాపులు, ఓవర్‌లోడ్ రవాణా వంటి అక్రమాలు బహిరంగంగానే జరుగుతున్నా.. వాటిపై చర్యలు ఎందుకు కనిపించడం లేదనే ప్రశ్నలు తరచూ వినిపిస్తుంటాయి. ఇలాంటి సందేహాల మధ్య కరీంనగర్‌లో వెలుగులోకి వచ్చిన గంజాయి కేసు మరింత సంచలనం సృష్టించింది.

మత్తుపదార్థాల నియంత్రణ కోసం పనిచేసే ఈగల్ టీమ్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ నాగరాజు... ఒక భూవివాదంలో తన స్నేహితుడికి సహాయం చేయడానికి ప్రత్యర్థిని గంజాయి కేసులో ఇరికించేందుకు కుట్ర చేశాడనే ఆరోపణలతో అరెస్టయ్యాడు. నేరాలను అరికట్టాల్సిన వ్యక్తే... నేరాన్ని సృష్టించే ప్రయత్నం చేశాడనే ఆరోపణ ప్రజల్లో ఆందోళన కలిగించింది.

అదే సమయంలో హన్మకొండ జిల్లాలో నమోదైన అత్యాచార కేసులో జమ్మికుంట మాజీ ఎస్సై కదిరె శ్రీకాంత్ అరెస్టవడం మరోసారి పోలీసు వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని మహిళపై లైంగిక దాడి చేశాడనే ఆరోపణలతో నమోదైన కేసులో ఆయన జైలుకు వెళ్లడం.. అధికార హోదాలో ఉన్న వ్యక్తుల ప్రవర్తనపై తీవ్ర చర్చకు దారితీసింది.

ఇంతటితో ఆగలేదు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో పే సెక్షన్‌లో పనిచేసిన ఉద్యోగి... ఇప్పటికే మరణించిన ముగ్గురు కానిస్టేబుళ్ల వివరాలను దుర్వినియోగం చేసి... వారి పేర్లతో నకిలీ ఖాతాలు తెరిచి కోట్లకు పైగా ప్రభుత్వ నిధులను మళ్లించాడనే కేసు వెలుగులోకి వచ్చింది. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన మోసం మాత్రమే కాదు... ప్రజలను రక్షించవలసిన వ్యవస్థలో ఇలాంటి లోపాలపై నిఘా ఏ స్థాయిలో ఉందనే ప్రశ్నను కూడా ముందుకు తెచ్చింది.

రోడ్డుపై బైక్ పార్కింగ్ విషయంలో ఓ యువకుడిపై ఆర్‌ఐ, ఇద్దరు ఆర్‌ఎస్‌ఐలు దాడి చేశారనే ఆరోపణలు... ఆ ఘటనను బ్లాక్‌మెయిల్‌కు ఉపయోగించమంటూ మరికొందరు సలహా ఇచ్చారనే కేసు... పోలీసు వ్యవస్థలో అంతర్గత క్రమశిక్షణపై కూడా సందేహాలు కలిగించాయి. ఇక డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో అక్రమ వసూళ్ల ఆరోపణలు మరో కోణాన్ని బయటపెట్టాయి. చిన్న మొత్తాలే అయినా... చట్టాన్ని అమలు చేయాల్సినవారే చట్టాన్ని వ్యాపారంగా మార్చుతున్నారనే విమర్శలకు ఇలాంటి ఘటనలు బలం చేకూరుస్తాయి.

ఈ వ్యవహారంలో విచారణ జరిపి సంబంధిత సిబ్బందిని సస్పెండ్ చేయడం శాఖ స్పందనను చూపించినా... ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయన్నదే ప్రశ్న. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. కొన్ని సంఘటనల ఆధారంగా మొత్తం పోలీసు శాఖను తప్పుబట్టడం సరైంది కాదు.

మరోవైపు ప్రజాస్వామ్యంలో పోలీసు వ్యవస్థకు ఉన్న బలం ఆయుధాలు కాదు.. ప్రజల విశ్వాసం. ఆ విశ్వాసం ఒక్కసారి దెబ్బతింటే తిరిగి సంపాదించడం చాలా కష్టం. అందుకే పారదర్శక విచారణలు, వేగవంతమైన చర్యలు, అంతర్గత పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడం ద్వారా మాత్రమే పోలీసు వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు..

#Telangana#Karimnagar#Police#Corruption#Eagle Team
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి