దేశంలోనే వేగంగా విస్తరిస్తున్న మహానగరాల్లో హైదరాబాద్ ఒకటి.. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగర సరిహద్దులు, రోజురోజుకూ పెరుగుతున్న మౌలిక వసతుల అవసరాల మధ్య.. నగర పాలనలో భారీ మార్పులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
అందులో భాగంగానే తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ బిల్లు–2026, అంటే CURE బిల్లును ప్రజాభిప్రాయం కోసం విడుదల చేసింది. ఈ కొత్త చట్టం కేవలం ప్రభుత్వ నిర్ణయంగా మాత్రమే కాకుండా, ప్రజల భాగస్వామ్యంతో రూపు దిద్దుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముసాయిదా బిల్లును బహిరంగంగా విడుదల చేసింది. దీనిపై పౌరుల నుంచి సలహాలు, సూచనలను, అభిప్రాయాలను జూలై 24వ తేదీ లోగా ప్రభుత్వానికి పంపాలని విజ్ఞప్తి చేసింది.
ఆన్‌లైన్‌లో లేదా లిఖితపూర్వకంగా పురపాలక శాఖకు ఈ సూచనలు పంపే అవకాశం కల్పించింది. వచ్చిన సూచనలను పరిశీలించిన తర్వాత అవసరమైన మార్పులు చేసి బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకురానుంది.
ఇక ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం... హైదరాబాద్‌తో పాటు దాని చుట్టుపక్కల వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రోపాలిటన్ ప్రాంతాలకు ఒకే విధమైన, సమన్వయంతో కూడిన పాలనా వ్యవస్థను తీసుకురావడం. ప్రస్తుతం వేర్వేరు శాఖలు, వేర్వేరు సంస్థల ఆధీనంలో ఉన్న సేవలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి... నిర్ణయాలు వేగంగా తీసుకోవడం, ప్రాజెక్టులను సమర్థవంతంగా అమలు చేయడం లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది.
రోడ్లు, ట్రాఫిక్ నిర్వహణ, డ్రైనేజీ, తాగు నీటి సరఫరా, విద్యుత్, పట్టణ ప్రణాళిక, ప్రజా రవాణా, పర్యావరణ పరిరక్షణ, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి కీలక అంశాల్లో శాఖల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు ఈ బిల్లు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అంతేకాదు.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నగరాభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించడం, ఆధునిక సాంకేతికతను వినియోగించడం, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడం కూడా ఈ బిల్లులోని ముఖ్య లక్ష్యాలుగా పేర్కొంటోంది.
అయితే..ఈ బిల్లుపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగర అభివృద్ధికి ఇది కీలక అడుగని ఒక వర్గం అభినందిస్తుండగా... స్థానిక సంస్థల అధికారాలు తగ్గే అవకాశం ఉందా? నిర్ణయాధికారం ఒకే వ్యవస్థలో కేంద్రీకృతమవుతుందా? ప్రజాప్రతినిధుల పాత్ర ఏమిటి? వంటి ప్రశ్నలను మరో వర్గం లేవనెత్తుతోంది.
మరి.. హైదరాబాద్ పట్టణ పాలనలో ఇది నిజంగానే చారిత్రాత్మక సంస్కరణలకు నాంది అవుతుందా? లేక కొత్త చర్చలకు తెరతీసే బిల్లుగా మిగిలిపోతుందా? అనేది తెలియాలంటే వెయిట్ చేయవలసిందే!..












