సాకర్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న ఫిఫావరల్డ్ కప్‌లో నాకౌట్ దశకు మ్యాచులు చేరుకోవడంతో గుండెలు బరువెక్కే దృశ్యాలు మైదానంలో కనిపిస్తున్నాయి. చిన్న జట్లు పెద్దజట్లకు షాక్ ఇస్తుండటంతో అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. నిన్నటి మ్యాచ్‌లో బ్రెజిల్‌ను నార్వే ఓడించింది.దీంతో బ్రెజిల్ జట్టు దిగ్గజ ప్లేయర్ నెయ్‌మర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
ఐదుసార్లు ప్రపంచకప్ విజేత బ్రెజిల్‌ను 2-1 తేడాతో ఓడించి నార్వే క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లడంతో కుంగిపోయిన స్టార్ ఆటగాడు నెయ్‌మర్ జాతీయజట్టులో తన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఆ టైంలో స్టేడియంలో తీవ్ర ఉద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నాడు. ఆ ప్రకటనతో నెయ్‌మర్ 16 ఏళ్ల కెరీర్ ముగిసింది. 1990 తర్వాత బ్రెజిల్ క్వార్టర్స్ కంటే ముందే ప్రపంచకప్ నుంచి బయటకు వెళ్లడం ఇదే తొలిసారి.ఎంతో రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో నార్వే ప్లేయర్ ఎర్లింగ్ హాలండ్ 2 రెండు గోల్స్ చేసి బ్రెజిల్ ఆశలపై నీళ్లు చల్లాడు.రెండో అర్ధభాగంలో నెయ్‌మర్ తుదివరకు పోరాడి ఓ గోల్ చేసినా..బ్రెజిల్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయాడు.
మెస్సీ, రొనాల్డో వంటి దిగ్గజ ప్లేయర్లలో నెయ్‌మర్ ఒకరు. బ్రెజిల్ జట్టు అనగానే నెయ్‌మర్ గుర్తొస్తాడు. 130 అంతర్జాతీయ మ్యాచుల్లో 80కి పైగా గోల్స్ చేసిన నెయ్ మర్.. బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో 2010లో అరంగేట్రం చేసిన నెయ్‌మర్.. అదే వేదికగా రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం.












