అర్ధరాత్రి వేళ ఎగసిపడిన మంటలు
కీలక కేసుల ఫైళ్లు, పత్రాల పరిస్థితిపై సస్పెన్స్!
నగరంలోని నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో తెల్లవారుజామున ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. కోర్టు భవనంలోని మూడవ అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికంగా ఆందోళన వాతావరణం నెలకొంది. మంటలు వ్యాపిస్తున్నట్లు గమనించిన వెంటనే స్థానికులు, సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.
దీంతో రెండు ఫైర్ ఇంజన్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. సమయానికి ఫైర్ ఇంజన్లు చేరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు. తెల్లవారుజామున ప్రమాదం జరగడం, ఆ సమయంలో కోర్టులో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












