తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా కిందికి పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు లక్ష్యం బీడు భూములకు సాగునీరు అందించడమేనని గుర్తు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎంతో కష్టపడి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని తెలిపారు.
కేసీఆర్ హయాంలో కేవలం నాలుగేళ్లలో 141 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైందని... ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలు మినహా రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు అందించే అవకాశం ఉందని అన్నారు..
వర్షం పడకపోయినా కన్నెపల్లి వద్ద నీరు ఉంటుందని, కాళేశ్వరం ప్రాజెక్టును వారం రోజుల పాటు కేసీఆర్‌కు అప్పగిస్తే తెలంగాణ మొత్తానికి నీరు అందిస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రైతులు కన్నెపల్లి పంప్‌హౌస్‌ను స్వయంగా వచ్చి చూసి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చిన ఆయన.. సాగునీటితో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకూ ఈ ప్రాజెక్టు కీలకమని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంపులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్పందించకపోతే.. 60 వేల మంది రైతులతో కలిసి కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ముట్టడించి పంపులను ఆన్ చేస్తామని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాల కంటే ప్రభుత్వానికి మరేదీ ముఖ్యమని ప్రశ్నించారు.
మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు నుంచే కాళేశ్వరంలో అవినీతి, లోపాలపై పోరాడుతుండగా... బీఆర్ఎస్ మాత్రం ప్రభుత్వం చేతగానితనం వల్లే నీళ్లు వృథా అవుతున్నాయని మండిపడుతోంది. మొత్తానికి కాళేశ్వరం, సాగునీటి అంశాలపై రెండు పార్టీల మధ్య పొలిటికల్ వార్ మరోసారి పీక్స్‌కు చేరింది!












