హైదరాబాద్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల టవర్లలో ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకుని, డ్రాలో ఎంపిక కాని వారికి ప్రభుత్వం డిపాజిట్ సొమ్ము (EMD) రూ. 10,000 తిరిగి ఇచ్చే ప్రక్రియను ప్రారంభించింది. తెలంగాణ హౌసింగ్ బోర్డు (TGHB) ఈ నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తోంది.అయితే, చాలా మందికి డిపాజిట్ సొమ్ము రాలేదని టాక్ వినిపిస్తోంది. దీంతో తమకు రీఫండ్ ఎప్పుడు వస్తుందా? అని దరఖాస్తుదారులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
అయితే, తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ లక్కీ డ్రాలో పాల్గొనేవారు రూ.10వేలు డిపాజిట్ కట్టాలని, లక్కీడ్రాలో ఇళ్లు వచ్చిన వారికి ఆ సొమ్ము తిరిగి ఇవ్వబడదని, పేరు రాని వారికి వెంటనే ప్రభుత్వం రీఫండ్ చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, లక్కీ డ్రా నిర్వహించి నెల రోజులు పూర్తయినా ఇంకా దరఖాస్తు దారులకు టోకెన్ అమౌంట్ రాలేదు.
దీంతో తమకు రూ.10 వేలు తిరిగి వస్తాయో లేదో అనే ఆందోళనలో ఇందిరమ్మ ఇళ్ల ఆశావహులు ఉన్నట్టు సమాచారం. ఇదిలాఉండగా, హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి తొలి విజయాన్ని అందించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని పట్టించుకోని రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో జూబ్లీహిల్స్ నియోజకవర్గం పేరు కనిపించలేదని పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి విస్మరించారని స్థానికులు మండిపడుతున్నారు.
ఇదిలాఉండగా, డబ్బులు రీఫండ్ పొందని వారు దాని స్టేటస్ తెలుసుకోవడానికి తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక పోర్టల్‌ను సందర్శించాలని లేదా.. హెల్ప్‌లైన్ నంబర్ 040-24603572ను కాల్ చేయాలని పలువురు సూచిస్తున్నారు. మీ సేవ ద్వారా డబ్బులు ఆన్‌లైన్‌లో చెల్లించిన వారు ఆటోమేటిక్ రీఫండ్ ద్వారానే వారి ఖాతాలో డబ్బులు జమ అవుతాయని, మరల ఎలాంటి ప్రత్యేక దరఖాస్తు చేసుకోనవసరం లేదని అధికారులు చెబుతున్నారు. డబ్బులు రీఫండ్ అయ్యేవరకు ఓపికగా ఉండాలని చెబుతున్నారు.


