తిన్న ప్రతిసారీ ఛాతీలో మంట.. కడుపులో ఉబ్బరం.. గొంతులోకి పుల్లటి ద్రవం వచ్చినట్టుగా అనిపిస్తుందా?.. అయితే తరచూ వేధించే అసిడిటీకి ఆహారపు అలవాట్లలో మార్పులు ఎంత ముఖ్యమో.. శరీరాన్ని చురుగ్గా ఉంచడం కూడా అంతే కీలకం. ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై సానుకూల ప్రభావం చూపించే కొన్ని యోగాసనాలను క్రమం తప్పకుండా చేయడం వల్ల అసిడిటీ లక్షణాల నుంచి ఉపశమనం పొందేందుకు కొంత సహాయం లభించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అసిడిటీ సమస్యలో ఉపయోగపడే ఆ యోగాసనాలు ఏంటి.. వాటిని ఎలా చేయాలి?
ముందుగా మార్జారియాసనం. క్యాట్-కౌ భంగిమగా కూడా పిలిచే ఈ ఆసనం వెన్నెముకతో పాటు పొత్తికడుపు ప్రాంతాన్ని కదిలిస్తుంది. ముందుగా చేతులు, మోకాళ్లపై బల్ల ఆకారంలో ఉండాలి. ఊపిరి పీల్చుకుంటూ తలను పైకి లేపి, వెన్నును కిందికి వంచాలి. ఆ తర్వాత ఊపిరి వదులుతూ వెన్నును పైకి ఎత్తి, తలను కిందికి వంచాలి. ఈ కదలికను నెమ్మదిగా, శ్వాసకు అనుగుణంగా చేయాలని యోగా నిపుణులు చెబుతున్నారు.
అలాగే తర్వాతి ఆసనం.. అధోముఖ శ్వానాసనం. చేతులు, మోకాళ్లపై ప్రారంభించి, ఊపిరి వదులుతూ నడుమును పైకి ఎత్తాలి. చేతులు, కాళ్లను సాధ్యమైనంతవరకు నిటారుగా ఉంచి, తలను చేతుల మధ్యకు తీసుకురావాలి. ఈ భంగిమలో కొద్దిసేపు ఉండి, నెమ్మదిగా తిరిగి ప్రారంభ స్థితికి రావాలి. ఇక మూడోది బాలాసనం. మోకాళ్లపై కూర్చొని, పాదాల బొటనవేళ్లను కలిపి, నడుము నుంచి ముందుకు వంగాలి. చేతులను ముందుకు చాపి, నుదిటిని నేలకు దగ్గరగా ఉంచాలి.
సౌకర్యంగా ఉన్నంతసేపు ఈ భంగిమలో ఉండి, నెమ్మదిగా పైకి రావాలి. ఈ ఆసనం శరీరానికి విశ్రాంతిని కలిగించే భంగిమగా యోగా సాధనలో ఉపయోగిస్తారు. అయితే ఛాతీలో మంట తరచూ వస్తుంటే దాన్ని కేవలం అసిడిటీగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా తీవ్రమైన ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మింగడంలో సమస్య లేదా తరచుగా మంట వస్తుంటే వైద్యుడిని సంప్రదించడం అవసరం. యోగాసనాలను కూడా శరీర సామర్థ్యానికి అనుగుణంగా, అవసరమైతే నిపుణుల సూచనతో చేయడం మంచిది.
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..












