క్రైమ్

TG : మణికొండలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్..అడ్డుకోబోయిన మహిళపై!

రచన: Kumar••4 నిమిషాల పఠనం

హైదరాబాద్ మహానగరంలో చెడ్డీ గ్యాంగ్ సంచారం మరోసారి కలకలం రేపింది. మణికొండ నెక్నాంపూర్‌లోని ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్స్ వెనుక వైపున్న చెరువు ఫెన్సింగ్‌ను కత్తిరించి సుమారు ఆరుగురు సభ్యుల చెడ్డీ గ్యాంగ్ ముఠా లోపలికి చొరబడింది. సీ-బ్లాక్ మెట్ల మార్గం ద్వారా ఒక ఫ్లాట్‌లోకి ప్రవేశించి విలువైన వస్తువులను దోచుకున్నట్టు సమాచారం.

హైదరాబాద్ మహానగరంలో చెడ్డీ గ్యాంగ్ సంచారం మరోసారి కలకలం రేపింది. మణికొండ నెక్నాంపూర్‌లోని ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్స్ వెనుక వైపున్న చెరువు ఫెన్సింగ్‌ను కత్తిరించి సుమారు ఆరుగురు సభ్యుల చెడ్డీ గ్యాంగ్ ముఠా లోపలికి చొరబడింది. సీ-బ్లాక్ మెట్ల మార్గం ద్వారా ఒక ఫ్లాట్‌లోకి ప్రవేశించి విలువైన వస్తువులను దోచుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో వారిని గమనించి అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఒక మహిళపై ఆయుధాలతో దాడికి పాల్పడగా.. ఆమె గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరార్ అయినట్టు తెలుస్తోంది.

తెల్లవారుజామున 3:20 గంటల ప్రాంతంలో ఆరుగురు అనుమానితులు అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించినట్టు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. సదరు మహిళతో ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన నార్సింగి పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం.ఇదిలాఉండగా, చెడ్డీ గ్యాంగ్ గతంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు.రాచకొండ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ ముఠా ఒకే రాత్రి వరుసగా తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి భారీగా దొంగతనాలకు పాల్పడింది.

ఈ క్రమంలోనే ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు గుజరాత్‌కు చెందిన ముగ్గురు అంతరాష్ట్ర చెడ్డీ గ్యాంగ్ సభ్యులను (కిషాబ్ బడియా, రావోజీ, భరత్) అరెస్ట్ చేశారు. వీరి నుంచి భారీగా బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 20కు పైగా దొంగతనాలు చేసినట్టు వీరిపై కేసులు నమోదైనట్టు తెలుస్తోంది.

చెడ్డీ గ్యాంగ్ దొంగతనాల స్టైల్ వేరేలా ఉంటుంది. కేవలం లోదుస్తులు (చెడ్డీ, బనియన్) మాత్రమే ధరించి, ఒంటికి నూనె రాసుకుని వస్తారు. ఎవరైనా పట్టుకోడానికి ప్రయత్నిస్తే వారి నుంచి జారిపోయి తప్పించుకోవడానికి సులువుగా ఉంటుందని అలా చేస్తారని తెలుస్తోంది.

అంతేకాకుండా చేతుల్లో కర్రలు, పదునైన కత్తులు, రాడ్లు వంటి ఆయుధాలు ఉంటాయి. ఎవరైనా అడ్డు వస్తే ప్రాణాలు తీయడానికైనా వెనకాడరు.పగటిపూట నిరుపేదల్లా, బుడగలు అమ్మేవారిలా కాలనీల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను రెక్కీ నిర్వహిస్తారు. అనంతరం అర్ధరాత్రి వీరు ప్రతాపం చూపుతారని పోలీసులు చెబుతున్నారు.

#Cheddi gang#robbery#hyderabad#manikonda#crime#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి