తెలంగాణ

Telangana: అమిత్ షా టూర్‌తో తెలంగాణలో పొలిటికల్ హీట్!.. బీజేపీ–బీఆర్ఎస్ పొత్తు పొడిచిందా?!..

రచన: Venu••5 నిమిషాల పఠనం

బీఆర్ఎస్‌లోని కొంతమంది నేతలు బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం కూడా అప్పుడప్పుడు తెరపైకి వస్తోంది. అదే విధంగా బీజేపీ–బీఆర్ఎస్ మధ్య తెరవెనుక చర్చలు జరుగుతున్నాయన్న వాదనలు రహస్యంగా ఉన్నాయి..

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ–బీఆర్ఎస్ మధ్య పొత్తు చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. అక్టోబర్ 4న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానుండటంతో.. ఈ పర్యటన చుట్టూ రాజకీయ వర్గాల్లో కొత్త లెక్కలు మొదలయ్యాయి. అధికారికంగా ఇది ఒక కార్యక్రమం కోసం జరుగుతున్న పర్యటనే అయినప్పటికీ.. రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.

దీనికి కారణం అమిత్ షా హాజరుకానున్న కార్యక్రమం ప్రతిమ గ్రూప్‌కు సంబంధించినది. ఆ సంస్థ ఛైర్మన్ బోయినపల్లి శ్రీనివాసరావు.. అయితే బోయినపల్లి కుటుంబానికి బీఆర్ఎస్ నేత వినోద్‌కుమార్‌తో ఉన్న రాజకీయ సంబంధాలను ప్రస్తావిస్తూ.. ఈ పర్యటనను బీజేపీ–బీఆర్ఎస్ మధ్య భవిష్యత్ సమీకరణాలకు సంకేతంగా కొందరు రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు.

ఇక 2028 ఎన్నికల నాటికి బీజేపీ, బీఆర్ఎస్ తమ రాజకీయ పొత్తులలో భాగంగానే ఈ భేటీ జరుగుతుందనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు రెండు పార్టీల మధ్య అధికారిక పొత్తు లేదని ఇరు పార్టీల నేతలు గతంలో ప్రకటనలు చేశారు. ముఖ్యంగా కేటీఆర్ ఇటీవల 2028లో బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండదని తేల్చిచెప్పారు. కానీ ఇవన్నీ పైపై ముచ్చట్లుగానే విశ్లేషకులు భావిస్తున్నారు..

అలాగే తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాలే ఇందుకు కారణమనే ప్రచారం జరుగుతుంది. ఇక కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్, బీజేపీ రెండూ తమ తమ స్థాయిలో పోటీ పడుతున్నాయి.. అయితే ఈ రెండు పార్టీలు విడివిడిగా బరిలోకి దిగితే ఓట్లు చీలే అవకాశాలున్నట్టు భావించిన బీజేపీ, బీఆర్ఎస్.. కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నట్టు పొలిటికల్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో బీఆర్ఎస్‌లోని కొంతమంది నేతలు బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం కూడా అప్పుడప్పుడు తెరపైకి వస్తోంది. అదే విధంగా బీజేపీ–బీఆర్ఎస్ మధ్య తెరవెనుక చర్చలు జరుగుతున్నాయన్న వాదనలు రహస్యంగా ఉన్నాయి.. మరోవైపు భవిష్యత్‌లో బీజేపీ–బీఆర్ఎస్ మధ్య అవగాహన ఏర్పడితే.. అది కేవలం రెండు పార్టీలకే సంబంధించిన అంశంగా ఉండదు.

తెలంగాణలో టీడీపీ, జనసేన రాజకీయ పాత్ర కూడా చర్చలోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఉన్న నేపథ్యంలో.. తెలంగాణలో కూడా టీడీపీ బలపడే అవకశాలున్నాయా? అనే ప్రశ్నలు మొదలైయ్యాయి. ఇప్పటికే రాష్ట్రంలో జనసేన యాక్టివ్ మోడ్ లోకి వస్తుంది. అలా అయితే బీఆర్ఎస్, బీజేపీ, జనసేనతో పాటు టీడీపీ నేతలు కూడా కాంగ్రెస్ కు వ్యతిరేఖంగా ఒక్కటి అయితే తెలంగాణ రాజకీయాలు అంతా గందరగోళంగా మారే పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

అదే సమయంలో బీఆర్ఎస్‌లో కేటీఆర్, హరీశ్‌రావు వంటి కీలక నేతల రాజకీయ భవిష్యత్ పై కూడా సందిగ్ధత నెలకొంటుందని అంటున్నారు.. ఇక బీజేపీ వ్యూహం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత రాబోయే కాలంలో రాష్ట్ర రాజకీయాలను మరింత హాట్ గా మార్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. మరోవైపు 2028 ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. కానీ తెలంగాణ రాజకీయాల్లో అప్పుడే రాజకీయ సమరం మొదలైందనే సంకేతాలు కనిపిస్తున్నాయి..

#Telangana#BRS#BJP#TDP#Janasena#Amit Shah#KTR
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి