రాష్ట్రంలో వినాయక చవితి పండుగ అయిపోయినా డీజే సౌండ్స్ మాత్రం ఆగడం లేదని సినీ నటుడు అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ ఆవేదన వ్యక్తం చేశాడు. రాత్రుళ్లు డీజే సౌండ్స్ మోత మోగించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. పోలీసులు వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.
వివరాల్లోకివెళితే.. అల్లు శిరీష్ నివాసం ఉంటున్న పరిసరాల్లో కొందరు వ్యక్తులు పెద్ద పెద్ద శబ్దాలతో డీజే పెడుతున్నారని, ఫలితంగా పిల్లలు, పెద్దలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సోషల్ మీడియా వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వినోభా నగర్‌లోని హనుమాన్ ఆలయంలో రాత్రి 2/3 వరకు అనుమతించిన దాని కన్నా ఎక్కువ శబ్దంతో సంగీతం మోగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.
తొలుత తాను ఫిల్మ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు గణేశ్ నిమజ్జనం దృష్ట్యా సెప్టెంబర్ 25వ తేదీ వరకు భరించమని చెప్పారని శిరీష్ గుర్తుచేశారు. అయితే.. నిమజ్జనం అయిపోయినా, పెద్ద శబ్దంతో కూడిన సంగీతం మాత్రం ఆగిపోలేదంటూ అల్లు శిరీష్ వాపోయారు. ఈ శబ్దం వల్ల షేక్‌పేట్‌లో తాము ఉంటున్న అపర్ణా టవర్ సొసైటీలోని పిల్లలు, పెద్దలు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మరోసారి ఫిర్యాదు చేశారు.
గతంలోనే చాలాసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇప్పటికైనా ఈ అంశాన్ని పరిశీలించాలని పోలీసులను ఆయన కోరారు.ఇదిలాఉండగా, వినాయక చవితి పండుగ సమయంలో కొందరు డీజేలను పోలీసుల అనుమతి మేరకు నిర్వహించారు. కానీ, పండుగ అయిపోయినా నిర్దేశించిన డెసిబెల్ సౌండ్స్ ప్రకారం కాకుండా ఎక్కువ మొత్తంలో శబ్దాలు చేసే వారి పట్ల చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. డీజే సౌండ్స్ వలన ఇటీవల కొందరు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.అందుకే నగరంలో డీజేలకు అనుమతి నిరాకరించాలని కూడా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.


