National

LPUలో అసలేం జరిగింది..? రేప్ ఆరోపణలపై యూనివర్సిటీ వీడియో.. విద్యార్థినుల సంచలన ఆరోపణలు!

రచన: Kashi••9 నిమిషాల పఠనం

లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ—ఎల్‌పీయూలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఓ విద్యార్థినిపై క్యాంపస్‌లో లైంగిక దాడి జరిగిందని, ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారాయి.

లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో రేప్ ఆరోపణలు..

విద్యార్థుల ఆందోళనలు.. హింసాత్మకంగా నిరసనలు..

యూనివర్సిటీ విడుదల చేసిన వీడియోపైనే కొత్త వివాదం

ఒకే ఘటనపై రెండు భిన్న కథనాలు

పంజాబ్‌లోని ఫగ్వారా ప్రాంతంలో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ—ఎల్‌పీయూలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఓ విద్యార్థినిపై క్యాంపస్‌లో లైంగిక దాడి జరిగిందని, ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారాయి. క్యాంపస్‌లో ఆస్తుల ధ్వంసం, వాహనాలకు నిప్పంటించడం, పోలీసులపై రాళ్లు రువ్వడం, జలంధర్–ఫగ్వారా జాతీయ రహదారిని దిగ్బంధించడం వరకు పరిస్థితి వెళ్లింది.

అయితే ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. రేప్ ఘటనను ఖండిస్తూ ఎల్‌పీయూ విడుదల చేసిన వీడియోలో కనిపించిన ముగ్గురు విద్యార్థినులే.. తమతో ఆ మాటలు చెప్పించారని, తమ వీడియోను ఎడిట్ చేసి అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పెట్టారని ఆరోపించారు. ఈ ఆరోపణలు ఇప్పుడు వివాదాన్ని మరింత సంక్లిష్టంగా మార్చాయి.

అసలు వివాదం ఎలా మొదలైంది?

విద్యార్థుల ఫిర్యాదుల ప్రకారం.. గర్ల్స్ హాస్టల్‌లో ఓ విద్యార్థినిపై క్యాంపస్‌లో పనిచేస్తున్న నిర్మాణ కార్మికుడు లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత హాస్టల్ వార్డెన్ బాధితురాలిని పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఇంటికి పంపించారని విద్యార్థులు ఆరోపించారు. తర్వాత ఆ విద్యార్థిని ఇంట్లో ఆత్మహత్య చేసుకుందని కూడా ప్రచారం జరిగింది.

ఈ రేప్, ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వాస్తవాలు ఇంకా దర్యాప్తులోనే ఉన్నాయి. పోలీసులు కూడా తొలుత తమకు ఇలాంటి ఘటనపై ముందుగా ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. అయితే విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అంటే.. ఒకవైపు యూనివర్సిటీ ఇది తప్పుడు ప్రచారం అంటోంది. మరోవైపు విద్యార్థుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు ఎల్‌పీయూ వివాదానికి కేంద్రబిందువుగా మారింది.

యూనివర్సిటీ విడుదల చేసిన వీడియోలో ఏముంది?

ఆందోళనలు తీవ్రంగా జరుగుతున్న సమయంలో ఎల్‌పీయూ రిజిస్ట్రార్ డాక్టర్ మోనికా గులాటీ ఒక వీడియో విడుదల చేశారు. రేప్ జరిగిందని ప్రచారం జరిగినట్లు చెబుతున్న గర్ల్స్ హాస్టల్-3లోని రూమ్ నంబర్ 504లో ఉంటున్న ముగ్గురు విద్యార్థినులను ఆ వీడియోలో చూపించారు. విద్యార్థినులు తమ గదిలో అలాంటి ఘటన ఏదీ జరగలేదని చెప్పారు. తమకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని, పదేపదే పోలీసులు, ఇతర విద్యార్థులు తమ గదికి రావద్దని కూడా కోరారు.

యూనివర్సిటీ మాత్రం ఈ వీడియోను తమపై వస్తున్న ఆరోపణలకు సమాధానంగా ఉపయోగించింది. రేప్, ఆత్మహత్యకు సంబంధించిన ప్రచారాన్ని తప్పుడు, నిరాధారమైన రూమర్లుగా పేర్కొంది. కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సోషల్ మీడియా ద్వారా గందరగోళం సృష్టిస్తున్నాయని ఆరోపించింది.

అసలు ట్విస్ట్ ఇక్కడే..

యూనివర్సిటీ విడుదల చేసిన వీడియోతో వివాదం సద్దుమణుగుతుందని భావించిన సమయంలో.. అదే ముగ్గురు విద్యార్థినులు మరో వీడియోలో సంచలన ఆరోపణలు చేశారు. తమకు ఏం చెప్పాలో యూనివర్సిటీ అధికారులు ముందే సూచించారని వారు ఆరోపించారు. తమను ఇతర విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పాలని సూచించారని, తాము చెప్పిన అసలు వీడియోలోని కొంత భాగాన్ని కట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని ఒక విద్యార్థిని ఆరోపించింది. అంతేకాదు.. తమ అనుమతి తీసుకోలేదని, వీడియో ఎలా ఉపయోగించారో తమకు తెలియదని కూడా ఆమె చెప్పింది. మరో విద్యార్థిని అయితే తమకు ఈ మొత్తం ఘటనతో ఎలాంటి సంబంధం లేదని, తమ రూమ్ నంబర్‌ను అనవసరంగా ఈ వివాదంలోకి లాగారని పేర్కొంది.

అసలు ప్రశ్నలు ఇవే...

ఇక్కడ రెండు వేర్వేరు అంశాలను విడిగా చూడాల్సి ఉంటుంది. మొదటిది.. లైంగిక దాడి జరిగిందా లేదా? రెండోది.. యూనివర్సిటీ విడుదల చేసిన వీడియోలో విద్యార్థినుల మాటలను నిజంగానే వారికి చెప్పించి రికార్డు చేశారా? ఈ రెండింటికీ సమాధానం దర్యాప్తులోనే తేలాల్సి ఉంది.

ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో డిజిటల్, సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. నిరసనకు దిగిన విద్యార్థుల నుంచి ఐదుగురు ప్రతినిధులను కూడా దర్యాప్తు ప్రక్రియలో భాగం చేశామని జలంధర్ రేంజ్ డీఐజీ నవీన్ సింగ్లా తెలిపారు. మొత్తం వ్యవహారాన్ని సమగ్రంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పారు.

అంటే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు కాదు.. సీసీటీవీ, ఫోన్ డేటా, ఫోరెన్సిక్ ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలే చివరికి కీలకం కానున్నాయి.

హింసాత్మకంగా ఆందోళనలు

మొదట విద్యార్థుల నిరసన న్యాయం కోసం నినాదాలతో ప్రారంభమైనప్పటికీ.. తర్వాత పరిస్థితి అదుపు తప్పింది. క్యాంపస్‌లో ఆస్తులు ధ్వంసమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. పోలీసు వాహనాలు, ఇతర వాహనాలు ధ్వంసమైనట్లు పోలీసులు తెలిపారు. జలంధర్–ఫగ్వారా జాతీయ రహదారిపై కూడా విద్యార్థులు బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎల్‌పీయూ కీలక నిర్ణయం తీసుకుంది.

సెప్టెంబర్ 28 నుంచి 10 రోజుల పాటు రెగ్యులర్ క్లాసులను నిలిపివేసింది. మిడ్‌టర్మ్ పరీక్షలను కూడా తదుపరి తేదీ ప్రకటించే వరకు వాయిదా వేసింది. విద్యార్థులు తల్లిదండ్రులతో సంప్రదించి ఇళ్లకు వెళ్లవచ్చని, క్యాంపస్‌లో ఉండేవారు హాస్టళ్లలోనే ఉండి అనవసరంగా బయటకు రావద్దని యూనివర్సిటీ సూచించింది.

ఇక ముందేం జరగబోతోంది?

ఇప్పుడు ఎల్‌పీయూ వ్యవహారం కేవలం యూనివర్సిటీ–విద్యార్థుల మధ్య వివాదంగా మిగిలిపోయే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవైపు లైంగిక దాడి ఆరోపణలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు యూనివర్సిటీ విడుదల చేసిన వీడియోపై విద్యార్థినులే చేసిన ఆరోపణలు కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఇంకోవైపు ఆందోళనల్లో జరిగిన ఆస్తి ధ్వంసం, పోలీసులతో ఘర్షణ వంటి అంశాలపైనా చట్టపరమైన చర్యలు ఉండే అవకాశం ఉంది.

#LPU#Lovely Professional University#LPU Students#LPU Protest#Punjab News#LPU Rape Case#University Protest#Student Protest#LPU Controversy#Punjab Crime News#Hostel Incident#LPU Viral Video#University News#Student Safety#Punjab Police#Campus Protest#India News#LPU Latest News#Lovely Professional University Protest
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి