గణపతి పండుగ ఉత్సవాలు భక్తుల్లో ఆనందాన్ని నింపాయి.. ఇక నిమజ్జన వేడుకల్లో నెలకొన్న కోలాహలం అయితే మామూలుగా లేదు. చిన్నా పెద్ద,యువతి,యువకులు అందరూ డప్పు చప్పుళ్లకు, తీన్మార్ డాన్సులకు అడుగులు కలుపుతూ ఊరేగింపులో మైమరిచిపోయారు. కానీ విగ్రహాలు, పూలు, పూజా సామగ్రితో పాటు ప్లాస్టర్, అలంకరణల వ్యర్థాలు, జలాశయాలు, పరిసర ప్రాంతాలపై ప్రభావం చూపుతూ పర్యావరణానికి భారంగా మారుతున్నాయా అనే చర్చకు తెరతీస్తున్నాయి..
మరోవైపు నిమజ్జన పాయింట్లు, గణేశ్ శోభాయాత్రలు సాగిన ప్రధాన మార్గాల్లో పెద్ద మొత్తంలో వ్యర్థాలు పేరుకుపోవడంతో పారిశుధ్య సిబ్బంది వాటిని తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ముఖ్యంగా ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్‌తో పాటు శోభాయాత్రలు సాగిన మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా కనిపించింది. జిడ్డు పదార్థాలు, ఆహార వ్యర్థాలు, పూజా సామగ్రి రోడ్లపై పడేయడంతో అవి రహదారులకు అతుక్కుపోయాయి.
దీంతో సాధారణంగా ఊడ్చి శుభ్రం చేయడం పారిశుధ్య సిబ్బందికి కష్టంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై పేరుకుపోయిన జిడ్డు కారణంగా వాహనాలు స్కిడ్ అవుతున్న పరిస్థితి కూడా కనిపించింది. మొదట పారిశుధ్య కార్మికులు రోడ్లను శుభ్రం చేసినప్పటికీ పూర్తిస్థాయిలో ఫలితం లేకపోవడంతో నీటి ప్రెజర్ మెషీన్లను రంగంలోకి దించారు. మొత్తం ఆరు వాటర్ ప్రెజర్ మెషీన్లతో రోడ్లను శుభ్రం చేస్తున్నారు.
ముందుగా చెత్తను సిబ్బంది తొలగించి, ఆ తర్వాత అధిక పీడనంతో నీటిని విడుదల చేసి రోడ్లకు అంటుకున్న మురికిని శుభ్రం చేస్తున్నారు. ఈ పారిశుధ్య పనులు సోమవారం మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇక ట్యాంక్‌బండ్ పరిసరాల్లో కలర్ పేపర్లు, పేపర్ ప్లేట్లు కూడా పెద్ద సమస్యగా మారాయి. వాటిని ఉపయోగించవద్దని అధికారులు సూచించినప్పటికీ, భారీగా వినియోగించడంతో రోడ్లపై ఎక్కడ చూసినా కాగితాలే కనిపించాయి.
వాటిని తొలగించేందుకు గతేడాది మాదిరిగానే జటాయ్ యంత్రాన్ని ఉపయోగించారు. రోడ్డుపై ఉన్న వ్యర్థాలను నేరుగా మెషీన్‌లోకి తీసుకోవడం దీని ప్రత్యేకత. అయితే రోడ్డుకు పేపర్లు అతుక్కుపోవడంతో వాటిని పూర్తిగా తొలగించడం సాధ్యం కాలేదు. ఇక రెండు రోజుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే సుమారు ఆరు వేల మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించినట్లు అధికారులు తెలిపారు.
మూడు కార్పొరేషన్ల పరిధిలో కలిపి ఈ వ్యర్థాల పరిమాణం దాదాపు 13 వేల మెట్రిక్ టన్నులకు చేరింది. ఈ చెత్తను జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. మూడు కార్పొరేషన్ల పరిధిలో సుమారు 15 వేల మంది పారిశుధ్య సిబ్బంది ఈ ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో భక్తి వేడుకలు ముగిసిన తర్వాత మిగిలిన ఈ భారీ వ్యర్థాల పరిమాణం.. ఉత్సవాల నిర్వహణలో పర్యావరణం, పారిశుధ్యంపై మరింత ప్రణాళిక అవసరాన్ని స్పష్టంగా చూపిస్తోంది..


