ఈసీ టార్గెట్ గా ఒక్కటవుతున్న విపక్షాలు
ఈనెల 30న ఢిల్లీలో మెగా మీటింగ్
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్
సీజేపీ హెచ్చరికలతో అప్రమత్తమైన కేంద్రం
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై విపక్షాల ఒత్తిడి పెరుగుతోంది. సెప్టెంబర్ 30న ఢిల్లీలో 21కి పైగా విపక్ష పార్టీలు సమావేశమై తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నాయి. మరోవైపు సీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ కూడా అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. అసలు ఈసీ చుట్టూ వివాదం ఎందుకు ఇంత పెద్దదైంది?
30న ఢిల్లీలో విపక్షాల మెగా మీటింగ్
ఎన్నికల సంఘం వ్యవహారంపై ఇప్పటివరకు విడివిడిగా స్పందించిన విపక్ష పార్టీలు.. ఇప్పుడు ఒకే వేదికపైకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. సెప్టెంబర్ 30న న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో 21కి పైగా విపక్ష పార్టీలు సమావేశం కానున్నట్లు సమాచారం. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించేందుకు పార్లమెంట్‌లో మరోసారి చర్యలు చేపట్టాలా? రాజీనామా డిమాండ్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి? ఎస్‌ఐఆర్‌పై దేశవ్యాప్త ఆందోళన ఎలా నిర్వహించాలి? వంటి అంశాలపై ఈ సమావేశంలో వ్యూహాన్ని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక్కడ మరో ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే.. పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం కూడా ఈ అంశంపై ఒకే వైపు నిలుస్తున్నాయి. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీ విపక్ష పార్టీలతో సమన్వయం కోసం చర్చలు జరుపుతూనే, మమతా బెనర్జీతోనూ సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.
అంటే.. ఎన్నికల సంఘం వ్యవహారం.. విపక్షాల మధ్య ఉన్న రాజకీయ విభేదాలను తాత్కాలికంగా పక్కన పెట్టే అంశంగా మారుతోందా? ఇదే ఇప్పుడు ఢిల్లీలో ఆసక్తికరమైన ప్రశ్న.
ఈసీపై ఇంత పెద్ద వివాదం ఎందుకు?
మొత్తం వివాదానికి కేంద్రంగా ఉన్న పదం.. SIR — స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని డ్రాఫ్ట్ ఓటర్ జాబితాల నుంచి 13 కోట్లకు పైగా పేర్లు తొలగించినట్టు వార్తలొచ్చాయి. ఈ ప్రక్రియపై ఈసీలోని ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత పది నెలల్లో కనీసం 14 సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు నేషనల్ మీడియాలో వచ్చిన వార్త సంచలనంగా మారింది.
ఈ అంశమే ఇప్పుడు రాజకీయంగా అగ్నికి ఆజ్యం పోసింది. కాంగ్రెస్ సహా విపక్షాలు కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. ఎన్నికల సంఘాన్నీ టార్గెట్ చేస్తున్నాయి. 13 కోట్ల పేర్లు ఎందుకు తొలగించాల్సి వచ్చింది? వారిలో నిజమైన ఓటర్లు ఎంతమంది? పేర్లు తొలగించే ముందు వారికి ఎలాంటి అవకాశం ఇచ్చారు? తప్పుగా పేరు తొలగిస్తే.. తిరిగి ఎలా చేర్చుకుంటారు? అనే ప్రశ్నలను కేంద్రం ముందుంచాయి.
మరోవైపు బీజేపీ వాదన వేరుగా ఉంది. తొలగించిన పేర్లలో 2.8 కోట్ల మంది మృతుల పేర్లు ఉన్నాయని, డూప్లికేట్ ఎంట్రీలు తదితర కారణాలతో కూడా పేర్లు తొలగించారని చెబుతోంది. దీనిపై కాంగ్రెస్ స్పందించింది. 2.8 కోట్ల మంది మృతుల పేర్లు ఉంటే, మిగిలిన 10.2 కోట్ల పేర్ల సంగతేంటి? అని ఆ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
అంటే ఇప్పుడు రాజకీయ యుద్ధం ఎన్ని పేర్లు తొలగించారు? అనే స్థాయి దాటి.. ఎందుకు తొలగించారు? అనే ప్రశ్న వద్దకు వచ్చి ఆగింది.
ఈసీలోనే 14 అభ్యంతరాలా?
ఈ వివాదంలో అత్యంత కీలకమైన మరో అంశం ఇదే. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి.. ఓటర్ల చేర్పులు, తొలగింపులు, ఫామ్-6, ఎలక్టోరల్ రోల్ డేటా వంటి అంశాలకు సంబంధించి 14 సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేశారని తెలుస్తోంది. దీంతో విపక్షాలు మరిన్ని ప్రశ్నలు సంధిస్తున్నాయి. అయితే ఈసీ మాత్రం తుది నిర్ణయాలు పూర్తి కమిషన్ ఏకాభిప్రాయంతోనే తీసుకున్నామని చెబుతోంది. అంతర్గత చర్చల్లో అభిప్రాయ భేదాలు ఉండటం సహజమేనని, వాటికి తుది నిర్ణయాలతో సంబంధం ఉండదని వివరణ ఇస్తోంది.
ఐతే అసలు డిబేట్ ఇప్పుడు ఇక్కడే మొదలైంది. అభ్యంతరాలు ఉంటే అవి ఏ అంశాలపై వచ్చాయి? ఆ అభ్యంతరాలకు కమిషన్ ఇచ్చిన సమాధానాలేంటి? చివరకు ఏ నిర్ణయం ఎలా తీసుకున్నారు? ఈ వివరాలు ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి వస్తేనే వివాదంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
రాజీనామా డిమాండ్.. పార్లమెంట్ దాకా?
విపక్షాల డిమాండ్ మాత్రం స్పష్టంగా ఉంది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి.. లేదంటే ఆయనను తొలగించే ప్రక్రియ చేపట్టాలి అనేది కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీల వైఖరి. సెప్టెంబర్ 30 సమావేశంలో పార్లమెంట్‌లో మరోసారి రిమూవల్ మోషన్‌కు సంబంధించిన వ్యూహంపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. దేశవ్యాప్త ఆందోళనను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నదీ చర్చలో ఉండొచ్చని తెలుస్తోంది.
కాక్రోచ్ జనతా పార్టీ ఎంట్రీ...
ఈ వ్యవహారాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది కాక్రోచ్ జనతా పార్టీ. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఠీక్ ఖరో.. పేరుతో ప్రచారాన్ని ప్రకటించింది. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయకపోతే అక్టోబర్ 2, గాంధీ జయంతి నుంచి దేశవ్యాప్త నిరసనలు చేపడతామని ప్రకటించింది.
ముంబయిలోని శివాజీ పార్క్‌లో అక్టోబర్ 2న నిరసనకు అనుమతి కోరగా పోలీసులు అనుమతి నిరాకరించినట్లు CJP సహ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు. అనుమతి ఇవ్వకపోతే జైల్ భరో ఆందోళన చేపడతామని ఆయన ప్రకటించారు. ఇక లద్దాఖ్ ఉద్యమకర్త సోనం వాంగ్‌చుక్ కూడా CJP ఆందోళనకు మద్దతు ప్రకటించారు. అయితే తాను ప్రత్యక్షంగా పాల్గొంటానని మాత్రం చెప్పలేదు. ఒకవైపు పార్లమెంట్‌లో విపక్షాల వ్యూహం, మరోవైపు వీధుల్లో నిరసనలకు పిలుపులు.. రెండు దిశల్లోనూ ఒత్తిడి పెరుగుతోంది.
30న అసలు ఏం తేలుతుంది?
ఇప్పుడు అందరి చూపు సెప్టెంబర్ 30పైనే ఉంది. ఆ రోజు విపక్షాలు కేవలం జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌ను పునరుద్ఘాటిస్తాయా?
లేక.. పార్లమెంట్‌లో రిమూవల్ ప్రాసెస్‌కు కొత్త అడుగు వేస్తాయా? SIRపై దేశవ్యాప్త ఉద్యమానికి ఒక కామన్ యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తాయా? ఇతర విపక్ష పార్టీలను కూడా ఈ పోరాటంలోకి తీసుకొస్తాయా? ఇవన్నీ ఇప్పుడు కీలకంగా మారాయి.
మరోవైపు అక్టోబర్ 2న CJP ప్రకటించిన ఆందోళన కూడా ముందుంది. అంటే సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 2 వరకు ఈసీ వ్యవహారం దేశ రాజకీయాల్లో మరింత హీట్ పెంచే అవకాశం ఉంది.
చివరికి తేలాల్సింది ఒక్కటే..
ఈ మొత్తం వివాదంలో పార్టీలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయన్నది ఒక రాజకీయ అంశం. కానీ ఓటర్‌కు సంబంధించిన అసలు ప్రశ్న మాత్రం చాలా సింపుల్. నా పేరు ఓటర్ లిస్టులో ఉందా? ఉంటే.. అది ఎలా నిర్ధారించారు? లేకపోతే.. ఎందుకు తొలగించారు? తప్పుగా తొలగిస్తే.. తిరిగి చేర్చుకునే ప్రక్రియ ఏంటి? SIRలో ఉపయోగించిన డేటా, వెరిఫికేషన్ విధానం, తొలగింపుల కారణాలు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియపై ఈసీ ఎంత ఎక్కువ వివరాలు బహిరంగంగా ఇస్తే.. అంత త్వరగా వివాదానికి సమాధానం దొరికే అవకాశం ఉంటుంది.
ఎందుకంటే.. ఎన్నికల సంఘంపై నమ్మకం అనేది అధికార పార్టీకి సంబంధించినది కాదు. విపక్షాలకు సంబంధించినది కాదు. అది ప్రతి ఓటరుకు సంబంధించినది. అందుకే ఇప్పుడు అసలు ఫోకస్.. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అనే దానిపై కాదు. 30న విపక్షాలు ఏం నిర్ణయిస్తాయి? ఈసీ ఏం సమాధానం ఇస్తుంది? SIRపై మరింత పారదర్శకత ఎలా వస్తుంది? ఓటర్ హక్కుకు రక్షణ ఎలా ఉంటుంది? ఈ నాలుగు ప్రశ్నల చుట్టూనే ఇప్పుడు దేశ రాజకీయాలు తిరుగుతున్నాయి.


