దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరగడం, బొగ్గు సరఫరాపై రాజకీయంగా తీవ్ర చర్చ కొనసాగుతున్న వేళ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్నారు. తక్కువ రుతుపవన వర్షపాతం కారణంగా అనేక ప్రాంతాల్లో జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడంతో, గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడేందుకు థర్మల్ విద్యుత్ ప్లాంట్లపై భార అదనంగా పడింది.
ఈ పరిస్థితిని అధిగమించేందుకు విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గు లభ్యతను, రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. తన పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 28న కోల్‌కతాలో హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్ (HCL), అల్యూమినియం రంగాలు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) అధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించారు.
సెప్టెంబర్ 29న కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) కార్యాలయంలో సీఐఎల్ చైర్మన్, వివిధ అనుబంధ సంస్థల సీఎండీలు, బొగ్గు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో మరో కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాను గరిష్ఠ స్థాయికి పెంచడం, రైల్వే వాగన్ల లభ్యత, శీతాకాలానికి ముందు బొగ్గు నిల్వలను పునరుద్ధరించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
ప్రతిపక్షాలు దేశంలో కరెంట్ కొరతపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో, బొగ్గు ఉత్పత్తిని, డిస్పాచ్‌ను పెంచేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను ఈ పర్యటన స్పష్టం చేస్తోంది. ప్రతీ ఏటా వర్షాకాలం తర్వాత పెరిగే విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు కోల్ ఇండియా ద్వారా సకాలంలో సరఫరా జరిగేలా చూడటంతో పాటు, ఝరియా మాస్టర్ ప్లాన్, బొగ్గు గ్యాసిఫికేషన్ వంటి దీర్ఘకాలిక ప్రాజెక్టుల ప్రగతిని కూడా మంత్రి సమీక్షించనున్నారు. ఈ సమీక్షల అనంతరం ఆయన ఢిల్లీకి తిరిగి ప్రయాణమవుతారు.


