National

నిర్భయ ఘటనను గుర్తుచేస్తున్న లైంగిక దాడులు.. సుప్రీంకోర్టు సీరియస్..!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

దేశ రాజధాని ప్రాంతం (ఢిల్లీ-ఎన్సీఆర్) పరిధిలో మైనర్ బాలికలపై వరుసగా చోటుచేసుకుంటున్న దారుణ లైంగిక దాడుల ఘటనలపై దేశ అత్యున్నత నాయస్థానం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కదులుతున్న స్లీపర్ బస్సులో బాలికపై జరిగిన దారుణంతో పాటు, దక్షిణ ఢిల్లీలోని ఒక పార్కులో జరిగిన సామూహిక అత్యాచార సంఘటనలను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది.

దేశ రాజధాని ప్రాంతం (ఢిల్లీ-ఎన్సీఆర్) పరిధిలో మైనర్ బాలికలపై వరుసగా చోటుచేసుకుంటున్న దారుణ లైంగిక దాడుల ఘటనలపై దేశ అత్యున్నత నాయస్థానం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కదులుతున్న స్లీపర్ బస్సులో బాలికపై జరిగిన దారుణంతో పాటు, దక్షిణ ఢిల్లీలోని ఒక పార్కులో జరిగిన సామూహిక అత్యాచార సంఘటనలను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. జస్టిస్ జె.బి. పర్దివాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసులను విచారణకు స్వీకరిస్తూ, మహిళలు, చిన్నారుల భద్రతా వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

బహిరంగ ప్రదేశాలైన పార్కులు, బస్ స్టాప్‌లలో కనీస వెలుతురు, పర్యవేక్షణ, సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్ల అవి నేరగాళ్లకు స్థావరాలుగా మారుతున్నాయని ధర్మాసనం మండిపడింది. ఘోరం జరిగిన తర్వాత కేవలం సానుభూతి లేదా సంఘీభావం ప్రకటించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, భద్రతా లోపాలకు కారణమైన సంబంధిత అధికారులను నేరుగా జవాబుదారీగా చేయాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పింది. సీసీటీవీల నిర్వహణ, పోలీసు గస్తీ, బహిరంగ ప్రదేశాల్లో మౌలిక వసతుల కల్పనపై నిర్లక్ష్యం వహించడం సరికాదని హెచ్చరించింది.

గ్రేటర్ నోయిడా నుంచి ఢిల్లీకి వెళ్తున్న స్లీపర్ బస్సులో 16 ఏళ్ల మైనర్ బాలికపై డ్రైవర్, కండక్టర్ అత్యంత అమానుషంగా లైంగిక దాడికి పాల్పడిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దాదాపు 47 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తూ, పలు పోలీస్ చెక్‌పోస్టులు దాటి వెళ్లినా అధికారులు వాహనాన్ని తనిఖీ చేయకపోవడం, బస్సులో సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం తీవ్ర భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది. మరో ఘటనలో దక్షిణ ఢిల్లీలోని ఓ పార్కులో పోలీసులుగా నటిస్తూ ముగ్గురు దుండగులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడటం రాజధానిలో రక్షణ వ్యవస్థ తీరును ప్రశ్నార్థకం చేసింది.

ఈ దారుణ ఘటనల నేపథ్యంలో ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో మహిళలు, చిన్నారుల రక్షణకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, పర్యవేక్షణ, పోలీసింగ్ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడంపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. అధికారుల బాధ్యతారాహిత్యాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలు, భద్రతా లోపాల నివారణపై తదుపరి విచారణలో కోర్టు సమగ్ర పరిశీలన జరపనుంది. ఈ ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా సుమోటోగా స్పందించి సమగ్ర నివేదిక కోరింది.

#SupremeCourt#DelhiNCR#MinorAssaultCase#WomenSafety#NirbhayaMemories#DelhiNews#SupremeCourtSuoMotu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి