Congress: తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమరం అధికార కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. నల్లగొండ-వరంగల్-ఖమ్మం, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గాల్లో ఎలాగైనా గెలిచి ప్రభుత్వ గ్రాఫ్‌ను నిరూపించుకోవాలని భావిస్తున్న హస్తం పార్టీకి.. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మాత్రం ఊహించని తలనొప్పిగా మారింది. పీసీసీ పరిశీలించి పంపిన ప్రాథమిక జాబితాలోనే అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడంతో గాంధీ భవన్ నుంచి ఢిల్లీ అధిష్ఠానం దాకా ఒకటే ఉత్కంఠ నెలకొంది.
అభ్యర్థుల విముఖతతో మొదలైన అసలు ట్విస్ట్
రెండు నియోజకవర్గాల కోసం ముగ్గురేసి చొప్పున మొత్తం ఆరుగురు నేతల పేర్లను రాష్ట్ర నాయకత్వం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు పంపింది. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ వెలుగు చూసిందని చెబుతున్నారు. రెండు స్థానాల్లోనూ మొదటి ప్రాధాన్యతగా భావించిన ముఖ్య నేతలు బరిలో దిగేందుకు ఏమాత్రం ఆసక్తి చూపకపోవడం పార్టీని డైలమాలో పడేసింది.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్..
ఇక్కడ ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నె జీవన్ రెడ్డి, పీసీసీ మీడియా కమిటీ మాజీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ గౌరి సతీష్ పేర్లను పరిశీలనకు పంపారు. వీరిలో ఆర్థికంగా, సామాజికంగా గట్టి పట్టు సాధించగలరని భావించిన మన్నె జీవన్ రెడ్డి పోటీకి తీవ్ర విముఖత చూపుతున్నట్లు సమాచారం.
విద్యావంతులు, ఐటీ నిపుణులు అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో ఆయనే సరైన చాయిస్ అని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. జీవన్ రెడ్డిని ఒప్పించేందుకు స్వయంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆయన ససేమిరా అంటే రామ్మోహన్ రెడ్డి, గౌరి సతీష్‌లలో ఒకరికి అవకాశం దక్కే వీలుందట.
నల్లగొండ-వరంగల్-ఖమ్మం:
దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తమ్ రెడ్డి, ఆర్టీఐ మాజీ కమిషనర్ పీవీ శ్రీనివాస్, పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ పేర్లను ఈ స్థానం కోసం కాంగ్రెస్ అధిష్ఠానం షార్ట్‌లిస్ట్ చేసిందని చెబుతున్నారు. అయితే సర్వోత్తమ్ రెడ్డి ఎమ్మెల్సీ బరిలో నిలవడానికి వెనకడుగు వేస్తుండటంతో పోటీ పీవీ శ్రీనివాస్, చనగాని దయాకర్ మధ్య రసవత్తరంగా మారిందని టాక్ నడుస్తుంది.
సామాజిక సమీకరణాలు.. హైకమాండ్ లెక్కలు..
ఈ రెండు స్థానాల అభ్యర్థుల ఎంపిక బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ పర్యవేక్షించారు. పార్టీ అంతర్గత వ్యూహం ప్రకారం.. ఒక నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ కేటాయిస్తే, రెండో స్థానాన్ని కచ్చితంగా బలమైన బీసీ అభ్యర్థికే ఇవ్వాలనే గట్టి ప్రతిపాదన ఉంది.
ఈ క్రమంలో నల్లగొండ స్థానంలో బ్రాహ్మణ కోటా కింద పీవీ శ్రీనివాస్ తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, బలమైన బీసీ కార్డుతో చనగాని దయాకర్ గట్టి పోటీ ఇస్తున్నారట. అటు హైదరాబాద్ స్థానంలో రెడ్డి వర్గానికి చెందిన నేత బరిలో ఉంటారా లేక బీసీ సమీకరణాల ఆధారంగా మార్పులు చేర్పులు జరుగుతాయా అన్నది సస్పెన్స్‌గా మారింది.
ఢిల్లీ వేదికగా ఫైనల్స్..
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 29న ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడే కేసీ వేణుగోపాల్ సహా అధిష్ఠాన పెద్దలతో భేటీ కానున్నారు. ఢిల్లీ వేదికగా ఈ రెండు స్థానాలకు ఎవరు బరిలోకి దిగుతారనే దానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.


