Salman Khan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీలా నిలిచిన సినిమాల్లో ‘ధృవ’ ఒకటి. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘తని ఒరువన్’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా పోలీస్ ఆఫీసర్, తెలివైన విలన్ మధ్య జరిగే మైండ్ గేమ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2016లో విడుదలైన ఈ చిత్రంలో రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్‌గా, అరవింద్ స్వామి విలన్‌గా కనిపించారు. అయితే, ఇప్పుడు వంశీ పైడి పల్లి బాలీవుడ్ స్టార్సల్మాన్ ఖాన్‌తో చేస్తున్న సినిమా దీనికి రీమేక్ అని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రస్తుతం SVC63 అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాను 2026 మార్చిలో అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభించారు. హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది. ప్రస్తుతం, ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
పోకిరి, రెడీ రీమేక్ చేసి హిట్ అందుకున్న సల్మాన్:
ఒకప్పుడు, హిందీలో వరుసగా ఫ్లాప్స్ అందుకున్నాడు సల్మాన్. ఆ సమయంలో వాంటెడ్ అనే సినిమాను చేసి భారీ హిట్ కొట్టాడు. ఆయేషా టాకియా హీరోయిన్‌గా రూపొందిన ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ సాధించిన పోకిరి చిత్రానికి హిందీ రీమేక్‌గా వచ్చింది. దీని, తర్వాత రామ్ పోతినేని హీరోగా నటించిన రెడీ సినిమా హిందీ రీమేక్‌లోనూ భాయ్ నటించి హిట్ కొట్టాడు. ఆ తర్వాత, ఇంకొన్ని తెలుగు బ్లాక్ బస్టర్స్ ని రీమేక్ చేసినా సక్సెస్ రాలేదు.
సల్మాన్ ఖాన్ సినిమాలో కూడా భారీ యాక్షన్, మల్టిపుల్ విలన్స్, పవర్‌ఫుల్ హీరో క్యారెక్టర్ ఉండబోతుందనే వార్తలు వస్తుండటంతో ‘ధృవ’ సినిమాతో పోలికలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమాలో సల్మాన్‌కు ఎదురుగా పలువురు ప్రతినాయకులు కనిపించనున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇందులో రాహుల్ దేవ్, అభిమన్యు సింగ్, అరవింద్ స్వామి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అంతేకాదు, జాకీ ష్రాఫ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం. అయితే జాకీ ష్రాఫ్ నెగెటివ్ లీడ్ కాదని, కథలో కీలకమైన పాత్రలో కనిపిస్తారని ఇంతకముందు వార్తలు వచ్చాయి.
మరి, ఈ కథ నిజంగా ధృవ సినిమానా లేక వంశీ పైడిపల్లి కొత్త కథతో తీస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది. రీమేక్ చేసి హిట్ కొట్టడం వంశీకి కొత్తేమీ కాదు. ఎవడు, ఊపిరి లాంటి సినిమాలు ఇతర భాషల్లో హిట్ సాధించిన కథలే. మరి, దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కథేంటో మేకర్స్ స్వయంగా రివీల్ చేస్తేనే తెలుస్తుంది.


