Ktr: బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ భూ బాధితులతో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా బహదూర్ గూడ రైతులతో మాట్లాడిన కేటీఆర్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భూ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు కేటీఆర్. పేదల భూములను ప్రభుత్వం దోచుకుంటోందని ఆరోపించారు. రైతుల పొట్టకొట్టి పెద్దల కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? అని నిలదీశారు. బుల్లెట్ ట్రైన్ కోసం పేదల భూములే ఎందుకు తీసుకోవాలి అని ప్రశ్నించిన కేటీఆర్.. ఎయిర్ పోర్టు భూములు ఎందుకు తీసుకోవడం లేదో చెప్పాలని రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేతల ఫొటోలు పోలీస్ స్టేషన్లలో పెట్టాలి
అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం భూములు ఇవ్వని రైతుల ఫొటోలను పోలీసులు తీస్తున్నారన్న కేటీఆర్.. హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ నేతల ఫొటోలను పోలీస్ స్టేషన్లలో పెట్టాలన్నారు. మూడేళ్లలో సీఎం రేవంత్ ఒక్క మంచి పనైనా చేశారా? అని కేటీఆర్ అడిగారు.
రేవంత్ కళ్లలో 5వేల కోట్లు మాత్రమే కనిపిస్తున్నాయి
''భూములు కొనడం, అమ్మడం, అందులో కొంత కమీషన్లు తీసుకోవడం.. రేవంత్ కు తెలిసిన ఏకైక విద్య ఇదే. ఇవాళ రేవంత్ రెడ్డి కన్ను బహదూర్ గూడ రైతుల భూముల మీద పడటానికి కారణం ఉంది. మీ దగ్గర ఎకరం భూమి విలువ 6 నుంచి 8 కోట్ల రూపాయలు ఉంటుంది. 650 ఎకరాలు అంటే రేవంత్ రెడ్డికి వేల కుటుంబాలు కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి కళ్లలో 5వేల కోట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. రేవంత్ కు మనుషులు కనిపించడం లేదు. ఆయన కళ్ల నిండా, నెత్తి నిండా 5వేల కోట్ల రూపాయలే కనిపిస్తున్నాయి. అందులో వచ్చే కమీషన్లు కనిపిస్తున్నాయి. అందుకే, పేదల పొట్టకొట్టి పెద్దలకు పెట్టే ఆలోచన చేస్తున్నారు రేవంత్ రెడ్డి'' అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
సుప్రీంకోర్టుకెళ్లైనా మీ భూములు కాపాడతాం
బహదూర్ గూడ భూములపై రేవంత్ కన్ను పడిందన్న కేటీఆర్.. సుప్రీంకోర్టుకెళ్లి బహదూర్ గూడ భూములను కాపాడుతామని ప్రకటించారు. బుల్లెట్ ట్రైన్ పేరుతో రైతులను నిండా ముంచుతున్నారని, ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డారు కేటీఆర్. రేవంత్ రెడ్డికి భూముల దందా తప్ప మరేమీ తెలియదని మండిపడ్డారు. కేసీఆర్ ఉన్నారనే విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోతున్నారన్న కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఏడాదిన్నర కాలం మాత్రమే ఉందని గుర్తు చేశారు.
రేవంత్‌కు భూదందా తప్ప మరేమీ తెలీదు
''భూమి సూర్యుడి చుట్టూ తిరిగినట్లు.. రేవంత్ రెడ్డి భూముల చుట్టూ తిరుగుతారు. ఆయనకు తెలిసింది ఒకటే దందా. భూముల దందా. మరేమీ తెలియదు. ప్రజలు, పేదలు, మీ బాధలు, న్యాయం చేయాలి ఇలాంటివి ఏమీ రేవంత్ కు తెలియదు. బుల్లెట్ ట్రైన్ విషయంలో మాకు వ్యతిరేకత లేదు. బుల్లెట్ ట్రైన్ రావాల్సిందే. కానీ, ఆ పేరు మీద రియల్ ఎస్టేట్ దందా చేస్తే మాత్రం ఊరుకునేది లేదు.
ఏడాదిన్నర తర్వాత కేసీఆర్ వస్తారు
ఏడాదిన్నర తర్వాత కేసీఆర్ వస్తారు. ఇది పక్కా. మీ పట్టాలు మీకు తప్పకుండా ఇస్తారు. ఏ కార్తిక్ రెడ్డి అయితే ఇవాళ హైకోర్టుకెళ్లి మీకు న్యాయం చేశాడో ఇదే కార్తిక్ రెడ్డి చేతుల మీదుగా మళ్లీ పట్టాలు ఇప్పించే బాధ్యత నాది. బుల్లెట్ ట్రైన్ జీఎంఆర్ భూముల్లో, ఎయిర్ పోర్టు భూముల్లో చేయరాదా? అక్కడ జాగా లేదు? మీరంతా ఒక్క తాటి మీద ఉంటేనే మీ భూములు మీకు మిగులుతాయి.
ఐక్యమత్యంగా లేకపోతే నష్టపోతారు
మీలో కొంతమంది చాటుగా వెళ్లి వేలిముద్రలు పెట్టడం, సంతకాలు పెట్టడం చేస్తే మీరే నష్టపోతారు. కేసీఆర్ ఎన్నికలకు ముందే చెప్పారు. మోసపోతే గోసపడతారని చెప్పారు. మీరు ఐక్యమత్యంగా లేకపోతే నష్టపోయేది మీరే. మీ ఊరు పోతుంది, భూమి పోతుంది. ఒక ఏడాదిన్నర ఆగితే ఎన్నికల కోడ్ వస్తుంది. ఎన్నికల కోడ్ వచ్చాక ఏమీ చేయడానికి లేదు. రైతుల భూములు కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టువరకైనా వెళ్తుంది. ఈలోపు మీరు సంతకాలు పెడితే మేము చేసేదేమీ లేదు.
ఎయిర్ పోర్టు జాగాలో బుల్లెట్ ట్రైన్ ఎందుకు పెట్టరు?
మీ భూములు మీకు కావాలంటే మీరంతా ఒక్క తాటిపైనే ఉండాలి. ఎయిర్ పోర్టు జాగాలో బుల్లెట్ ట్రైన్ ఎందుకు పెట్టడం లేదని అధికారులను నిలదీయండి. పక్కనే 2,500 నుంచి 3వేల ఎకరాల ఖాళీ ప్రభుత్వం జాగా ఉంది. ఎయిర్ పోర్టు జాగా అంటే ప్రభుత్వానికి చెందిన జాగానే. అక్కడ బుల్లెట్ ట్రైన్ పెట్టొచ్చు. ఈ మాటను మీరు అధికారులను అడగాలి. న్యాయపరంగా మీకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది'' అని రైతులకు హామీ ఇచ్చారు కేటీఆర్.


