ఆంధ్రప్రదేశ్‌లో నిషేధిత జాబితా అయిన సెక్షన్ 22-A పరిధిలో ఉన్న అర్హత కలిగిన భూములపై నిషేధాన్ని వెంటనే తొలగించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. చట్టబద్ధత, అర్హత కలిగిన ప్రైవేట్, ఫ్రీహోల్డ్ భూములను తక్షణమే 22-A జాబితా నుంచి మినహాయించాలని ఆయన కోరారు. ఆయా భూ యజమానులకు గతంలో మాదిరిగా రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని వెంటనే పునరుద్ధరించి వారి హక్కులను కాపాడాలని ఈ సందర్భంగా లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఒకే సర్వే నంబర్‌కు సంబంధించి రికార్డుల్లో నమోదైన డూప్లికేట్, పాత, ఎలాంటి ఆధారాలు లేని 22-A ఎంట్రీలను త్వరితగతిన తొలగించాలని మాధవ్ సూచించారు. అసలు ఒక భూమిని నిషేధిత 22-A జాబితాలో ఎందుకు చేర్చారు, దానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు, గెజిట్ లేదా ఇతర చట్టపరమైన రికార్డులు ఏమిటనే వివరాలను భూ యజమానులకు పారదర్శకంగా తెలియజేసేలా ఆన్‌లైన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆయన కోరారు. అర్హత లేని భూములు అనవసరంగా ఈ జాబితాలో కొనసాగకుండా పక్కా పరిశీలనా విధానాన్ని తీసుకురావాలన్నారు.
22-A జాబితా నుంచి భూములను తొలగించేందుకు రైతులు, భూ యజమానులు ఇచ్చే దరఖాస్తులపై విచారణ, తుది నిర్ణయం మరియు అప్పీల్ ప్రక్రియకు స్పష్టమైన కాలపరిమితిని (టైమ్ లైన్) నిర్ణయించాలని ప్రభుత్వానికి సూచించారు. క్షేత్రస్థాయి ధృవీకరణ పూర్తయి చట్టప్రకారం రిజిస్ట్రేషన్‌కు అర్హత పొందిన భూములకు వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని కోరారు. అలాగే జిల్లా వారీగా నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూముల సమగ్ర వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచితే భూ యజమానుల్లో ఉన్న అనిశ్చితి, భయాలు తొలగిపోతాయని పేర్కొన్నారు.
రైతులకు, సామాన్య ప్రజలకు భూమి అనేది కేవలం ఆస్తి మాత్రమే కాదని, అది వారి కుటుంబ ఆర్థిక భద్రతకు, భవిష్యత్ తరాల జీవనానికి అత్యంత కీలకమైన ఆధారమని పీవీఎన్ మాధవ్ అభిప్రాయపడ్డారు. భూమి యాజమాన్య వివరాల్లో పారదర్శకత పెంచడం వల్ల అర్హులైన యజమానులకు తమ ఆస్తులపై పూర్తి హక్కులు లభిస్తాయని స్పష్టం చేశారు. అందువల్ల అర్హత ఉన్న భూములను 22-A నుంచి తొలగించే ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబును ఆయన కోరారు.












