National

Rummy Culture: ఫోన్ స్క్రీన్ వెనుక వేల కోట్ల మాఫియా.. తెలుగు రాష్ట్రాల్లో నిషేధం ఉన్నా ఆగని దందా!

రచన: Mahesh•••6 నిమిషాల పఠనం

Rummy Culture: చేతిలో స్మార్ట్‌ఫోన్ ఆన్ కాగానే చాలు.. ‘లక్షలు గెలవండి.. జీవితాన్ని మార్చుకోండి’ అంటూ ప్రత్యక్షమయ్యే ఆకర్షణీయమైన ప్రకటనలు. ఒక్క క్లిక్‌తో మొదలయ్యే సరదా, క్షణాల్లోనే వ్యసనంగా మారి సామాన్యుడి జేబులను గుల్ల చేస్తోంది.

Rummy Culture: చేతిలో స్మార్ట్‌ఫోన్ ఆన్ కాగానే చాలు.. ‘లక్షలు గెలవండి.. జీవితాన్ని మార్చుకోండి’ అంటూ ప్రత్యక్షమయ్యే ఆకర్షణీయమైన ప్రకటనలు. ఒక్క క్లిక్‌తో మొదలయ్యే సరదా, క్షణాల్లోనే వ్యసనంగా మారి సామాన్యుడి జేబులను గుల్ల చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ పేకాట, రియల్ మనీ గేమింగ్‌పై కఠిన నిషేధం అమలులో ఉన్నప్పటికీ, కార్పొరేట్ ముసుగులో సాగుతున్న ఈ డిజిటల్ దోపిడీకి అడ్డే లేకుండా పోయింది.

చట్టాల కళ్లుగప్పి తెరవెనుక సాగుతున్న వేల కోట్ల అక్రమ దందాపై ఎట్టకేలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పంజా విసిరింది. ‘రమ్మీ కల్చర్’ అక్రమ సామ్రాజ్యాన్ని బట్టబయలు చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ చేపట్టిన మెరుపు దాడులు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

నిషేధాన్ని తుంగలో తొక్కి..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ యాప్‌లను ప్రభుత్వం ఎప్పుడో నిషేధించింది. అయితే ఈ నిబంధనలను గేమ్‌క్రాఫ్ట్ టెక్నాలజీస్, రమ్మీ టైమ్ టెక్నాలజీస్ యాజమాన్యాలు ఏమాత్రం లెక్కచేయలేదు. నిషేధిత రాష్ట్రాల్లోని యూజర్లను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా నకిలీ ఐడీలు, సరికొత్త ప్రాక్సీ మార్గాలను సృష్టించారు.

స్థానిక లొకేషన్లను దాచిపెడుతూ, లొసుగులను వాడుకుని ‘రమ్మీ కల్చర్’, ‘రమ్మీ ప్రైమ్’, ‘ప్లేయర్‌షిప్’ వంటి మొబైల్ యాప్‌ల ద్వారా మూడు కోట్ల మంది అమాయక యూజర్లను తమ ఉచ్చులోకి లాగారు. ఒక్క తెలంగాణలోనే నమోదైన పలు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులకు.. స్క్రీన్ వెనుక జరుగుతున్న ఈ వ్యవస్థీకృత నేరం చూసి దిమ్మతిరిగిపోయింది.

రూ.1000 కోట్ల ప్రచారం.. రూ.2843 కోట్ల అక్రమ సామ్రాజ్యం

ప్రజలను మరింతగా మాయచేసేందుకు ఈ సంస్థలు పెట్టిన ఖర్చు సామాన్యమైనది కాదని అంటున్నారు. కేవలం తమ యాప్‌ల ప్రమోషన్ల కోసమే ఏకంగా రూ.1,000 కోట్లకు పైగా వెచ్చించారంటే, ఈ నెట్‌వర్క్ వేళ్లూనుకున్న స్థాయిని అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. ప్రముఖులు, సోషల్ మీడియా వేదికగా సాగిన ఈ ప్రచారాల వెనుక సామాన్యుల కష్టార్జితం ఆవిరైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈడీ జరిపిన లోతైన ఆడిట్‌లో.. బెట్టింగ్ యాప్‌ల ద్వారా నిర్వాహకులు ఏకంగా రూ.2,843 కోట్ల అక్రమ ఆదాయాన్ని కొల్లగొట్టినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ప్రజల నుంచి లాక్కున్న ఈ వేల కోట్ల రూపాయలను సూపర్ బూస్ట్ రూపాంతరాల్లోకి మార్చడంతో పాటు, గుట్టుచప్పుడు కాకుండా హవాలా మార్గాల్లో ఇతర ప్రాంతాలకు తరలించి సంస్థ నిర్వాహకులు తమ సొంత విలాసాల కోసం మళ్లించినట్లు అధికారులు గుర్తించారు.

17 చోట్ల దాడులు.. విల్లాలు, ఎఫ్‌డీలు జప్తు

హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 17 కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. అక్రమ సంపాదనతో కూడబెట్టిన విలాసవంతమైన విల్లాలు, భారీ కమర్షియల్ కాంప్లెక్స్‌లు, నివాస సముదాయాలతో పాటు భారీగా ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఈడీ అటాచ్ చేసింది. వందలాది అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను తక్షణమే స్తంభింపజేసింది.

ఇప్పటికే రూ.2,400 కోట్లకు పైగా ఆస్తులను జప్తు చేసిన దర్యాప్తు సంస్థ, తాజాగా మరో రూ.442 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద సీజ్ చేస్తూ నోటీసులు జారీ చేసింది.

నిషేధం ఉన్నా సరే.. టెక్నాలజీ మాటున సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ కార్పొరేట్ బెట్టింగ్ మాఫియాపై ఈడీ ఉచ్చు మరింత బిగుస్తోంది. ఈ వ్యవహారంలో తెరవెనుక ఉన్న కీలక సూత్రధారులు, మద్దతుదారుల భరతం పట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికైనా ఈ రమ్మీ కల్చర్ తెలుగు రాష్ట్రాల్లో క్లోజ్ అవుతుందా అనే అభిప్రాయాలు సామాన్యుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.

#Rummy Culture#Online Rummy#Online Gambling#Rummy Culture Scam#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి