Ktr: సీఎం రేవంత్ సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డికి పలు ప్రశ్నలు సంధించారు. ఈ నెల 30న సిరిసిల్లకు వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీలు మూడేళ్లు కావస్తున్నా ఎందుకు నెరవేర్చలేదో సమాధానం చెప్పాలని కేటీఆర్ నిలదీశారు.
సీఎం రేవంత్ తన సిరిసిల్ల పర్యటనలో ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏ కు మార్చే హామీపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ముదిరాజ్‌లు ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముదిరాజ్‌ల న్యాయమైన డిమాండ్ అమలయ్యేవరకు బీఆర్ఎస్ పార్టీ అన్నివిధాలుగా అండగా ఉంటుందని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. ముదిరాజ్‌ల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని కేటీఆర్ హామీ ఇవ్వడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ముదిరాజ్ సంక్షేమ సంఘం నేతలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు తరలివచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. వివిధ పార్టీలకు చెందిన ముదిరాజ్ నేతలంతా ఐక్యంగా కలిసి వచ్చి కేటీఆర్‌తో భేటీ అయ్యారు.
ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏ లోకి మార్చాలన్న డిమాండ్‌తో ఇటీవల సిరిసిల్లలో నిర్వహించిన ముదిరాజ్ సింహగర్జన బహిరంగ సభ విజయవంతమైన సందర్భంగా కేటీఆర్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. ముదిరాజ్ సింహగర్జన బహిరంగ సభ నిర్వహణకు సహకరించిన కేటీఆర్‌కు ముదిరాజ్ నేతలు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు పెద్దమ్మ తల్లి చిత్రపటాన్ని అందించి శాలువాతో సత్కరించారు.












