షాద్‌నగర్‌లో జింక మాంసం కలకలం!
రాయికల్ టోల్‌గేట్ వద్ద జింక మాంసం పట్టివేత?
జింక మాంసం తరలిస్తుండగా పట్టుబడ్డ నిందితులు?
జింకలను వేటాడి మాంసం తరలింపు?
రాయికల్ టోల్‌గేట్‌పై అటవీశాఖ నిఘా
Deer Meat: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో జింక మాంసం తరలింపు కలకలం రేపింది. షాద్‌నగర్ పట్టణ శివారులోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద జింక మాంసాన్ని పట్టుకున్నారు. అటవీశాఖ అధికారులకు అందిన సమాచారం మేరకు ఎస్ఓటీ (స్పెషల్ ఆపరేషన్స్ టీమ్) పోలీసులు టోల్ ప్లాజా వద్ద నిఘా పెట్టి జింక మాంసాన్ని తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల అదుపులో 8మంది
8మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 13 కిలోల జింక మాంసంతో పాటు వేటకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న రైఫిల్, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కొత్తూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. అటవీశాఖకు చెందిన ప్రత్యేక బృందం పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. పోలీసులు, అటవీ శాఖ అధికారులు అనుమానితులను విచారిస్తున్నారు.
జింకలను ఎక్కడ వేటాడారు? మాంసం ఎక్కడికి తరలిస్తున్నారు?
జింకలను వేటాడి వాటి మాంసాన్ని కారులో తరలిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు అప్రమత్తయ్యారు. రాయికల్ టోల్ ప్లాజా వద్ద నిఘా పెట్టారు. వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో జింక మాంసం పట్టుబడింది. అనుమానాస్పదంగా ఉన్న రెండు కార్లను చెక్ చేయగా వాటిలో జింక మాంసాన్ని గుర్తించారు.
జింకలను ఎక్కడ వేటాడారు? జింక మాంసం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? ఎవరి కోసం రవాణ చేస్తున్నారు? అదుపులోకి తీసుకున్న వ్యక్తులు ఎవరు? ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా? అనే అంశాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. సంరక్షిత వన్యప్రాణుల వేట, అక్రమ రవాణాకు సంబంధించిన ఏదైనా విస్తృత నెట్‌వర్క్‌లో అనుమానితులు భాగమై ఉన్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.
జింక మాంసం తరలింపు వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. దీన్ని అటవీశాఖ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వన్యప్రాణి సంరక్షణ చట్టం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనుమానితులు 8మందిని కోర్టులో హాజరుపరచనున్నారు. దర్యాప్తు పురోగతిలో భాగంగా వారిని జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని కోరే అవకాశం ఉంది.



