TG : చేతబడి చేస్తోందన్న మూఢనమ్మకంతో ఓ వృద్ధురాలిపై గ్రామస్థులు కర్కశంగా దాడి చేసిన అమానుష ఘటన రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. 60 ఏళ్ల వృద్ధురాలిని చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
వివరాల్లోకి వెళ్తే.. మంచాల మండలం నోముల గ్రామానికి చెందిన పల్లటి వెంకటమ్మ (60) చేతబడులు చేస్తోందంటూ కొందరు గ్రామస్థులు అనుమానం పెంచుకున్నారు. ఈ క్రమంలో ఆమెపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన కొందరు, బలవంతంగా ఆమెను లాక్కెళ్లి ఊళ్లోని ఓ చెట్టుకు తాళ్లతో కట్టేసి.. నిర్దాక్షిణ్యంగా దాడి చేసి తీవ్రంగా కొట్టారు.
బాధితురాలు వెంకటమ్మ కష్టం మీద వారి నుంచి తప్పించుకుని మంచాల పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. తనపై మూఢనమ్మకాలతో దాడి చేసి చిత్రహింసలు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన 14 మంది గ్రామస్థులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అమానుషంగా ప్రవర్తించిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు.


