Prabhas: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘కల్కి 2898 ఏడీ పార్ట్ 2’ ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి భాగం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడంతో పాటు భారీ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళను రాబట్టింది. ఇక, ఇప్పుడు సీక్వెల్‌పై దర్శకుడు నాగ్ అశ్విన్ ఇచ్చిన తాజా అప్‌డేట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.
అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం:
తాజాగా నాగ్ అశ్విన్ వెల్లడించిన వివరాల ప్రకారం ‘కల్కి 2’ రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ రెండవ వారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌లకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను హైదరాబాద్ శంకర్ పల్లిలో చిత్రీకరించినట్లు దర్శకుడు తెలిపారు. ప్రభాస్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నామని, ఇప్పుడు ఆయన కాల్‌షీట్స్ కూడా అందుబాటులోకి రావడంతో లాంగ్ షెడ్యూల్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.
ఇప్పటివరకు ఓ పది రోజుల షూటింగ్ మాత్రమే పూర్తయిందని నాగ్ అశ్విన్ గతంలో వెల్లడించారు. అయితే, ఇకపై లాంగ్ షెడ్యూల్‌లో షూటింగ్ జరపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, తాజా సమాచారం మేరకు ఇప్పుడు రాబోయే సీక్వెల్ కల్కి 2 లో కూడా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించబోతున్నారని తెలుస్తోంది. పార్ట్ 1 లో దుల్కర్ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుంది. కానీ, సీక్వెల్‌లో మాత్రం ఈ పాత్ర ఇంకా బలంగా, ఎక్కువ నిడివితో నాగ్ అశ్విన్ డిజైన్ చేశాడట. అంతేకాదు, ఈసారి ప్రభాస్-దుల్కర్‌ల మధ్య ఎక్కువ సీన్స్ ఉంటాయట.
ఇక, పార్ట్ 1 లో ఉన్న దీపికను మేకర్స్ తొలగించారు. ఆమె స్థానంలో ఆయి పల్లవి వచ్చి చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ‘కల్కి 2’ షూటింగ్‌ను 2027 మధ్య నాటికి పూర్తి చేయాలని నాగ్ అశ్విన్ టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తయిన తర్వాత భారీ స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్, ముఖ్యంగా వ్FX పనులు జరగాల్సి ఉంటుంది. అందుకే సినిమా విడుదల తేదీపై ఇప్పుడే ఎలాంటి అధికారిక ప్రకటన చేయడం లేదని దర్శకుడు స్పష్టం చేశారు. అయితే, నాగ్ అశ్విన్ తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే 2028లో ‘కల్కి 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.


