Sri Vashishta Institutions: నగరంలో విద్యా వ్యాపారం నిబంధనల హద్దులు దాటుతున్న వేళ, శ్రీ వశిష్ట ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ వ్యవహారశైలిపై తీవ్రస్థాయి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూల్స్‌ను యథేచ్ఛగా గాలికి వదిలేస్తూ, విద్యార్థుల భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది. సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ లింగమనేని ప్రమీల రాణి నాయకత్వంలో నడుస్తున్న ఈ విద్యాసంస్థల్లో బోర్డు రూల్స్ బేఖాతరు అవుతున్నా, విద్యాశాఖ నిద్రమత్తు వీడకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకే కోడ్‌తో విచ్చలవిడి బ్రాంచీలు.. చూసీచూడనట్లు బోర్డు వ్యవహారం?
ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం ఒక కాలేజీ కోడ్ కింద ఒకే క్యాంపస్ నడవాల్సి ఉండగా, శ్రీ వశిష్ట సంస్థ మాత్రం ఒకే కోడ్‌ను అడ్డం పెట్టుకుని నగరవ్యాప్తంగా సమాంతర క్యాంపస్‌లు తెరిచిందని ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థుల సంఖ్యను పరిమితికి మించి పెంచుకుంటూ, సరైన వసతులు లేని చోట్ల బ్రాంచీలను నడిపిస్తున్నా అధికారులు తనిఖీలు చేపట్టకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.

భద్రతా అనుమతులు శూన్యం.. ప్రమాదం జరిగితే బాధ్యులెవరు?
వేలాది మంది విద్యార్థుల ప్రాణాలు ముడిపడి ఉన్న క్యాంపస్‌లలో కనీస రక్షణ ఏర్పాట్లు లేకపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు అత్యవసర రక్షణ కల్పించే ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు లేకుండానే క్యాంపస్‌లు కొనసాగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి.
కమర్షియల్, స్ట్రక్చరల్ బిల్డింగ్ అనుమతులు లేకుండానే పెద్ద ఎత్తున క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. హైడ్రా సూచించిన కీలక నిబంధనలు, చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిమితుల అనుమతులను లెక్కచేయకుండానే కాలేజీల ప్రాంగణాలు కొనసాగిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రచార ఆర్భాటం.. ఫీజుల మోతపై కళ్లప్పగించిన అధికారులు
నిబంధనలకు విరుద్ధంగా ర్యాంకుల ప్రకటనలతో విద్యార్థులను, తల్లిదండ్రులను ప్రలోభపెట్టి అడ్మిషన్లు తీసుకోవడం, ఆపై భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేయడం బహిరంగంగానే జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి సర్వత్రా నెలకొంది. కళ్లముందే ఇంతటి ఉల్లంఘనలు దర్శనమిస్తున్నా, ఏ ఒక్క అధికారికీ నోటీసులు ఇచ్చే తీరిక లేకపోవడం వెనుక ఎవరి ఒత్తిళ్లు పనిచేస్తున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయన్న ధీమాతోనే మేనేజ్‌మెంట్ వ్యవహరిస్తోందా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదైనా విపత్తు సంభవించిన తర్వాత స్పందించడం కంటే, ఇప్పటికైనా విద్యాశాఖ నిద్రమత్తు వీడి తక్షణమే సమగ్ర విచారణ జరపాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.


