National

ట్రాఫిక్ చలాన్ పెండింగా..? ఐతే మీ ఇంటికి కరెంట్ కట్..!

రచన: Kashi•••7 నిమిషాల పఠనం

దేశవ్యాప్తంగా పేరుకుపోయిన పెండింగ్ చలాన్లు ఇప్పుడు భారీ మొత్తానికి చేరాయి. ఈ సమస్యపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. చలాన్లు విధించడం మాత్రమే కాదు, వాటిని వసూలు చేయడానికి కూడా కఠినమైన మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచించింది.

పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై సుప్రీం సీరియస్

చలాన్ల వసూళ్లకు కీలక సూచనలు

చలాన్ కట్టకపోతే.. కరెంట్ కట్

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చలాన్ పడుతుంది. ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. కానీ ఆ తర్వాత కొందరు వాహనదారులు చలాన్ చెల్లించకుండా వదిలేస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా పేరుకుపోయిన పెండింగ్ చలాన్లు ఇప్పుడు భారీ మొత్తానికి చేరాయి. ఈ సమస్యపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. చలాన్లు విధించడం మాత్రమే కాదు, వాటిని వసూలు చేయడానికి కూడా కఠినమైన మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచించింది.

ఈ సందర్భంగా కోర్టు చేసిన ఒక సూచన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను విద్యుత్ బిల్లులతో అనుసంధానం చేసే అవకాశాన్ని పరిశీలించాలన్నది ఆ సూచన. అయితే ఇది అమలు చేయాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ఆదేశం ఇవ్వలేదు. ఇది ఒక సూచన మాత్రమే.

దేశవ్యాప్తంగా రూ.45 వేల కోట్ల పెండింగ్ చలాన్లు

రూ. 45 వేల కోట్లు. ఇదీ దేశంలో పేరుకుపోయిన పెండింగ్ చలాన్ల మొత్తం విలువ. అందుకే సుప్రీం కూడా ఆ స్థాయిలో సీరియస్ అయింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఈ-చలాన్ల పరిస్థితి కోర్టు ముందుకు వచ్చింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి సుమారు రూ.45 వేల కోట్ల ఈ-చలాన్ బకాయిలు వసూలు కావాల్సి ఉన్నట్లు కోర్టు దృష్టికి వచ్చింది. ఐతే ఇందులో ఇప్పటికే రూ. 25 వేల కోట్లు వసూలైనట్టు అధికారులు కోర్టుకు తెలిపారు.

చలాన్లను కరెంట్ బిల్లుతో లింక్ చేయాలా?

విచారణ సందర్భంగా జస్టిస్ జేబీ పార్దివాలా ఒక ఆలోచనను ముందుకు తెచ్చారు. ట్రాఫిక్ చలాన్లు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచితే.. ఆ బకాయిలను వారి విద్యుత్ బిల్లులతో అనుసంధానం చేసే అవకాశాన్ని పరిశీలించవచ్చా? అని సూచించారు. కరెంట్ బిల్లు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ప్రజలు కరెంట్ బిల్లును నిర్లక్ష్యం చేయరని కోర్టు పేర్కొంది.

అదే విధంగా చలాన్లను కూడా ఏదైనా తప్పనిసరి చెల్లింపుతో అనుసంధానం చేస్తే.. బకాయిల వసూళ్లు పెరుగుతాయా అన్నది పరిశీలించాలన్నది కోర్టు ఆలోచన.

ఆర్సీ రెన్యువల్‌పై పెండింగ్ చలాన్ల ప్రభావం

ఆర్సీ రెన్యువల్ చేసే సమయంలో పెండింగ్ చలాన్లను పరిగణనలోకి తీసుకునే విధానాన్ని పరిశీలించాలని కోర్టు సూచించింది. అంటే భవిష్యత్‌లో వాహనం ఆర్సీ రెన్యువల్ చేసుకునే సమయంలో.. పాత చలాన్లు క్లియర్ చేశారా లేదా అన్నది కూడా పరిశీలించే అవకాశం ఉండొచ్చు.

వాహనం అమ్మేటప్పుడు చలాన్లు అడ్డంకిగా?

పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాల యాజమాన్య బదిలీని కూడా నియంత్రించే అంశాన్ని కోర్టు ప్రస్తావించింది. అంటే వాహనాన్ని ఒకరి పేరునుంచి మరొకరి పేరుకు మార్చే సమయంలో పెండింగ్ చలాన్లు కూడా పరిగణనలోకి వచ్చే విధానాన్ని పరిశీలించాలన్నమాట.

ఇక పెండింగ్ చలాన్లు పూర్తిగా చెల్లించని వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేయకుండా ఉండే అవకాశాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. దీంతో వాహనం రోడ్డు మీద నడవడానికి అవసరమైన కొన్ని ప్రక్రియలతో చలాన్ల చెల్లింపును అనుసంధానం చేసే అవకాశం ఉంటుంది.

డ్రైవింగ్ లైసెన్స్‌పై చర్యలు

పెండింగ్ చలాన్లు ఉన్నవారి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్‌ను నిలిపివేయడం వంటి చర్యలను కూడా పరిశీలించాలని కోర్టు సూచించింది.

అవసరమైన సందర్భాల్లో ఇప్పటికే ఉన్న లైసెన్సులపై కూడా చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలించాలని పేర్కొంది. పీయూసీ సర్టిఫికెట్ జారీ చేసే సమయంలో కూడా పెండింగ్ చలాన్లను పరిగణనలోకి తీసుకునే విధానాన్ని పరిశీలించాలని సూచించింది.

అంటే వాహనానికి సంబంధించిన ప్రతి ముఖ్యమైన సర్వీస్‌ను చలాన్ల చెల్లింపుతో అనుసంధానం చేసే అవకాశాలను అధికారులు పరిశీలించాలన్నది కోర్టు సూచనల ఉద్దేశం. తనిఖీల్లో భారీగా పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాలను అవసరమైన సందర్భాల్లో అధికారులు స్వాధీనం చేసుకునే అంశాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది.

ఇది ముఖ్యంగా పదేపదే నిబంధనలు ఉల్లంఘించే, భారీగా చలాన్లు పెండింగ్‌లో ఉంచే వాహనదారుల విషయంలో కఠిన చర్యలకు దారితీసే అవకాశం ఉన్న అంశం.

కోర్టు చెప్పిన మెయిన్ పాయింట్ ఇదే!

సుప్రీంకోర్టు సూచనలన్నింటి వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఒక్కటే. చలాన్ వేయడం మాత్రమే కాదు.. చలాన్ డబ్బు కూడా వసూలు కావాలి. అందుకే చలాన్లను కేవలం ఒక జరిమానాగా కాకుండా.. వాహనానికి సంబంధించిన ఇతర సేవలతో అనుసంధానం చేసి వసూలు చేయగలమా అనే దిశగా ఆలోచనలను ముందుకు తెచ్చింది కోర్టు.

#supreme court#traffic challans#unpaid traffic fines#e challan#pending challans#traffic fines#electricity bills#power bills#supreme court news#traffic rules#India traffic news#road safety#vehicle rules#India news#latest news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి