వ్యాపారం

టాటా సన్స్‌ రూపమే మారనుందా..? టాటా ట్రస్ట్స్ కీలక ప్లాన్!

రచన: Kashi••9 నిమిషాల పఠనం

టాటా గ్రూప్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గ్రూప్‌కు పెద్ద అంబ్రెల్లాలా ఉండే టాటా సన్స్ భవిష్యత్ నిర్మాణాన్ని మార్చే ప్రతిపాదనను టాటా ట్రస్ట్స్ తెరపైకి తీసుకొచ్చాయి. ఈ ప్రతిపాదన అమలైతే.. టాటా సన్స్ కేవలం టాటా గ్రూప్ కంపెనీలను నియంత్రించే హోల్డింగ్ కంపెనీగా కాకుండా, సొంతంగా వ్యాపారాలు చేసే సంస్థగా మారనుంది.

టాటా గ్రూప్‌లో కీలక పరిణామం

మారిపోనున్న టాటా సన్స్ భవిష్యత్ నిర్మాణం

ఇక డైరక్ట్ గా బిజినెస్ లోకి టాటా సన్స్

టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఏం జరుగుతోంది..?

టాటా గ్రూప్‌లో ఇప్పుడు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గ్రూప్‌కు పెద్ద అంబ్రెల్లాలా ఉండే టాటా సన్స్ భవిష్యత్ నిర్మాణాన్ని మార్చే ప్రతిపాదనను టాటా ట్రస్ట్స్ తెరపైకి తీసుకొచ్చాయి. ఈ ప్రతిపాదన అమలైతే.. టాటా సన్స్ కేవలం టాటా గ్రూప్ కంపెనీలను నియంత్రించే హోల్డింగ్ కంపెనీగా కాకుండా, సొంతంగా వ్యాపారాలు చేసే సంస్థగా మారనుంది.

అసలు ఈ మార్పు ఎందుకు? టాటా సన్స్‌కు స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌తో దీనికి సంబంధం ఏంటి? టాటా ట్రస్ట్స్ ఎందుకు ఈ ప్రతిపాదన చేశాయి? ఇదే ఇప్పుడు ఆసక్తికరం.

అసలు ఏం జరుగుతోంది?

టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్స్‌కు 66 శాతం వాటా ఉంది. అంటే టాటా సన్స్‌లో మెజారిటీ వాటాదారు టాటా ట్రస్ట్సే. ఇప్పుడు టాటా సన్స్ నిర్మాణాన్ని మార్చాలని టాటా ట్రస్ట్స్ ప్రతిపాదించాయి. ఇందులో భాగంగా టాటా ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ సొల్యూషన్స్, అంటే TESS, అలాగే టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్, అంటే TCE సంస్థలను టాటా సన్స్‌లో విలీనం చేయాలని సూచించాయి.

సింపుల్‌గా చెప్పాలంటే.. ఇప్పటివరకు టాటా సన్స్ ప్రధానంగా టాటా గ్రూప్‌లోని వివిధ కంపెనీలకు పైస్థాయి హోల్డింగ్ కంపెనీగా ఉంది. ఇప్పుడు దాని కింద ఉన్న కొన్ని అసలు వ్యాపారాలను నేరుగా టాటా సన్స్‌లోకి తీసుకురావాలన్నది ప్రతిపాదన.

దీంతో టాటా సన్స్‌కు ఏం లాభం..?

ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఒక కంపెనీ కేవలం ఇతర కంపెనీల్లో వాటాలు పెట్టుకుని, వాటిని నియంత్రిస్తుంటే.. దాని నిర్మాణం ఒక రకంగా ఉంటుంది. కానీ అదే కంపెనీకి సొంతంగా వ్యాపారాలు, కార్యకలాపాలు, ఆదాయం ఉంటే పరిస్థితి మరోలా ఉంటుంది. టాటా ట్రస్ట్స్ ప్రతిపాదన అమలైతే.. టాటా సన్స్‌కు TESS, TCE ద్వారా నేరుగా ఆపరేటింగ్ బిజినెస్‌లు వస్తాయి. అంటే టాటా సన్స్ కేవలం టాటా గ్రూప్‌కు మాతృ సంస్థగా కాకుండా.. సొంతంగా వ్యాపారం చేసే సంస్థగా కూడా మారుతుంది. ఇది టాటా సన్స్ గత చరిత్రకు కూడా దగ్గరగా ఉంటుంది.

లిస్టింగ్‌తో ఎందుకు లింక్ అయింది?

ఇక్కడే ఈ మొత్తం వ్యవహారంలో అసలు ఆసక్తికరమైన అంశం ఉంది. టాటా సన్స్‌కు సంబంధించి NBFC, అంటే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, అలాగే CIC, అంటే కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ అనే నియంత్రణ వర్గీకరణలు కీలకంగా మారాయి. టాటా ట్రస్ట్స్ చెబుతున్నదేమిటంటే.. ప్రతిపాదిత మార్పులు అమలైతే పునర్వ్యవస్థీకరించిన టాటా సన్స్ ఇక NBFC లేదా CICగా ఉండదని.

అలా జరిగితే ప్రస్తుతం ఉన్న నియంత్రణ అవసరాల నుంచి టాటా సన్స్‌కు భిన్నమైన స్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ప్రతిపాదనను టాటా సన్స్‌ను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయాల్సిన పరిస్థితికి ఒక ప్రత్యామ్నాయ మార్గంగా టాటా ట్రస్ట్స్ చూస్తున్నాయి.

అయితే ఇది వెంటనే జరిగిపోయే విషయం కాదు. ప్రతిపాదనపై టాటా సన్స్ బోర్డు నిర్ణయం తీసుకోవాలి. అవసరమైన అనుమతులు తీసుకోవాలి. ముఖ్యంగా ఆర్‌బీఐ నుంచి నో-ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా అవసరం.

TESS, TCE ఎందుకు కీలకం?

ఇప్పుడు విలీనం చేయాలని ప్రతిపాదించిన ఈ రెండు సంస్థలు ఏం చేస్తాయన్నది కూడా తెలుసుకోవాలి. టాటా ఎలక్ట్రానిక్స్ టాటా గ్రూప్‌లో అత్యంత కీలకంగా ఎదుగుతున్న వ్యాపారాల్లో ఒకటి. సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, స్మార్ట్‌ఫోన్ భాగాలు వంటి రంగాల్లో టాటా గ్రూప్ భారీగా అడుగులు వేస్తోంది.

మరోవైపు టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ ఇంజినీరింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో సేవలు అందిస్తోంది. పవర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిసోర్సెస్ వంటి విభాగాల్లో ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రాజెక్టులు చేసింది. అంటే.. ఈ రెండు కంపెనీలు కేవలం పెట్టుబడులు పెట్టే సంస్థలు కావు. నేరుగా వ్యాపారం చేసి ఆదాయం సంపాదించే కంపెనీలు. అందుకే వీటిని టాటా సన్స్‌లో విలీనం చేయడం ద్వారా టాటా సన్స్ రూపమే మారే అవకాశం ఉంది.

ఇది టాటాకు కొత్తేమీ కాదు!

టాటా ట్రస్ట్స్ చెప్పిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. టాటా సన్స్ చరిత్రలో ఇలాంటి నిర్మాణం కొత్తది కాదట. దాదాపు 100 ఏళ్ల చరిత్రలో 80 ఏళ్ల పాటు టాటా సన్స్‌కు సొంత ఆపరేటింగ్ బిజినెస్‌లు, ఆదాయ వనరులు ఉండేవని టాటా ట్రస్ట్స్ తెలిపాయి. ఉదాహరణగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌నే తీసుకుంటే.. 2004 వరకు TCS కూడా టాటా సన్స్‌లోని ఒక బిజినెస్ డివిజన్‌గా ఉండేది. ఆ తర్వాత దాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీశారు. ఇప్పుడు టాటా ట్రస్ట్స్ ప్రతిపాదనను చూస్తే.. టాటా సన్స్‌ను కొంతవరకు మళ్లీ పాత మోడల్‌లోకి తీసుకెళ్లాలన్న ఆలోచన కనిపిస్తోంది.

టాటా గ్రూప్‌లో మరో కీలక మలుపా?

ఈ ప్రతిపాదన మరో కారణంతో కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. టాటా సన్స్ భవిష్యత్ నిర్మాణం, లిస్టింగ్ వంటి అంశాలపై టాటా ట్రస్ట్స్, టాటా సన్స్ మధ్య ఇప్పటికే విభేదాలు ఉన్న సమయంలో ఈ ప్రతిపాదన వచ్చింది. అందుకే ఇది కేవలం కంపెనీల విలీనం వ్యవహారం మాత్రమే కాదు. టాటా గ్రూప్ భవిష్యత్‌లో దాని అత్యంత కీలకమైన సంస్థ అయిన టాటా సన్స్ ఎలా ఉండబోతుందన్న దానిపై తీసుకునే పెద్ద నిర్ణయం.

ప్రస్తుతం ఇది టాటా ట్రస్ట్స్ చేసిన ప్రతిపాదన మాత్రమే. దీనిపై టాటా సన్స్ బోర్డు నిర్ణయం, ఆర్‌బీఐ అనుమతులు తదుపరి కీలక దశలు. అయితే ఈ ప్రతిపాదన అమలైతే మాత్రం.. టాటా సన్స్ కేవలం టాటా గ్రూప్‌కు హోల్డింగ్ కంపెనీగా కాకుండా, సొంత వ్యాపారాలు, సొంత ఆదాయంతో నడిచే మరో బలమైన ఆపరేటింగ్ సంస్థగా మారే అవకాశం ఉంది. అంటే.. టాటా గ్రూప్‌లో కంపెనీల విలీనం మాత్రమే కాదు.. టాటా సన్స్ రూపాన్నే మార్చే ప్రయత్నం ఇప్పుడు తెరపైకి వచ్చింది.

#tata sons#tata trusts#tata group#tata sons listing#tata sons ipo#tata trusts plan#tata restructuring#tata electronics#TESS#TCE#RBI#tata group news#business news#India business news#corporate news#Tata Sons latest news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి