అన్నం బ్రహ్మ, రసో విష్ణుః, భోక్తా దేవో జనార్దనః అని మన శాస్త్రం చెబుతుంది. భారతీయ సంస్కృతిలో భోజనం చేయడం అంటే ఏదో ఆకలి తీర్చుకోవడానికి శరీరాన్ని నింపే లౌకిక కార్యం కాదు.. శరీరమనే యజ్ఞకుండంలో, అంతర్యామియైన జఠరాగ్నికి అర్పించే ఒక దివ్యమైన ఆహుతి.. సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణా దేవి ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు మనస్సు ఎలా ఉండాలి? ఏ దిక్కున కూర్చొని భుజించాలి? మన పూర్వీకులు ఏర్పరచిన ఆ సనాతన భోజన నియమాల వెనుక ఉన్న అంతరార్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
అరటి ఆకులో భోజనం చేయడం మన సనాతన సంప్రదాయంలో ప్రత్యేకమైనది. అరటి ఆకుపై వేడి అన్నం, పదార్థాలు వడ్డించినప్పుడు ఆకులోని సహజ సుగంధం, రుచిని ప్రభావితం చేస్తుందని భావిస్తారు. పైగా ఉపయోగించిన ఆకును సులభంగా ప్రకృతిలో కలపవచ్చు. అందుకే అతిథులకు అరటి ఆకులో భోజనం పెట్టడం మన సంస్కృతిలో ఆతిథ్యానికి ఒక ప్రతీకగా మారింది.
ధర్మసంప్రదాయంలో భోజనం విషయంలో మరో ముఖ్యమైన భావన ఉంది. మనం కూర్చున్న తర్వాతే భోజనం వడ్డించుకోవాలి. అన్నం కోసం మనం ఎదురుచూడాలి కానీ.. అన్నమే మన కోసం ఎదురుచూసేలా చేయకూడదనే భావన దీని వెనుక ఉంది. ఇది అన్నానికి ఇచ్చే గౌరవాన్ని, అన్నదాత పట్ల కృతజ్ఞతను సూచిస్తుంది.
అలాగే భోజనం చేసే దిక్కుకూ సైతం సంప్రదాయంలో ప్రాధాన్యం ఉంది. తూర్పు ముఖంగా భుజించడం ఆయుష్షుకు, పడమర బలానికి, ఉత్తరం సంపదకు, దక్షిణం కీర్తికి అనుకూలమని కొన్ని ఆచార సంప్రదాయాలు చెబుతాయి. మరోవైపు అన్నం ముందు కూర్చున్నప్పుడు కోపం, తిట్లు, గొడవలు, పరిహాసం వంటివి దూరంగా ఉంచాలని పెద్దలు చెప్పారు. ఎందుకంటే భోజనం చేసే సమయం శరీరానికి ఆహారం అందించే సమయమే కాదు.. మనసును కూడా ప్రశాంతంగా ఉంచే సమయం.
ఇక అన్నాన్ని వృథా చేయకూడదు. ఏడుస్తూ, కోపంతో లేదా అవమాన భావంతో భోజనం చేయకూడదని చెప్పడం వెనుక అన్నాన్ని దేవతా స్వరూపంగా చూసిన భావన ఉంది. అలాగే అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించి, దాన్ని అందించిన ప్రకృతికి, రైతుకు, వంట చేసిన చేతులకు, అన్నపూర్ణ తల్లికి కృతజ్ఞత చెప్పే పవిత్ర సంస్కారం మన సంప్రదాయంలో ఉంది.. భోజనం ముందు మనసు ప్రశాంతంగా ఉంటే.. ఆహారం కడుపునే కాదు, మన జీవితాన్నీ సంతృప్తితో నింపుతుందనే సందేశమే ఈ ఆచారాల అంతరార్థం.
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.


