పంటల్లో కలుపు నివారణ కోసం వినియోగించే అత్యంత విషపూరితమైన రసాయనాల్లో ఒకటైన పారాక్వాట్ డైక్లోరైడ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మానవులు, జంతువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందన్న నిపుణుల కమిటీ సిఫార్సుల నేపథ్యంలో ఈ హెర్బిసైడ్‌పై నిషేధం విధిస్తూ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిషేధం తక్షణమే అమల్లోకి రానుందని తెలిపింది. పారాక్వాట్ డైక్లోరైడ్‌కు ఇకపై కొత్త రిజిస్ట్రేషన్లు ఇవ్వకూడదని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు, ఇప్పటికే జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను కూడా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత సర్టిఫికెట్లను ప్రభుత్వానికి అప్పగించాలని, నిషేధాన్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. ఈ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితంగా అమలు చేయాలని కూడా సూచించింది.
ఇన్సెక్టిసైడ్స్ యాక్ట్, 1968 కింద నిపుణుల కమిటీ, రిజిస్ట్రేషన్ కమిటీ చేసిన పరిశీలనలు, సిఫార్సుల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. ఈ ఏడాది జూలై 10న కేంద్రం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసి, దానిపై ప్రజలు, సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరించింది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది నిషేధ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఇక పారాక్వాట్ అత్యంత విషపూరితమైన రసాయనం. అనుకోకుండా శరీరంలోకి చేరినా తీవ్రమైన విష ప్రభావాలు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఊపిరితిత్తులు, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో వైద్యపరంగా ఇది ఆందోళన కలిగించే రసాయనంగా పరిగణిస్తారు. తీవ్రమైన విషప్రయోగం జరిగినప్పుడు చికిత్స కూడా క్లిష్టంగా మారుతుంది.
ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు, పర్యావరణ వర్గాల నుంచి పారాక్వాట్ వినియోగంపై నిషేధం కోరుతూ చాలాకాలంగా డిమాండ్లు ఉన్నాయి. వ్యవసాయంలో కలుపు నియంత్రణ అవసరం ఉన్నప్పటికీ, దాని వల్ల కలిగే ఆరోగ్య, పర్యావరణ ప్రమాదాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్న వాదనలు ఉన్నాయి.
మొత్తంగా చూస్తే.. పారాక్వాట్ డైక్లోరైడ్‌కు సంబంధించిన కొత్త రిజిస్ట్రేషన్లను నిలిపివేయడంతో పాటు, పాత రిజిస్ట్రేషన్లను కూడా రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశంలో ఈ రసాయనం వినియోగంపై కీలక మార్పుకు దారితీసే అవకాశం ఉంది. ఇక నుంచి నిషేధం అమలు, నిల్వలు, విక్రయాలు, వినియోగంపై రాష్ట్రాల స్థాయిలో పర్యవేక్షణ కీలకం కానుంది.


