National

New Delhi: గుజరాత్ వర్సెస్ దేశం.. మోదీ సర్కార్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!!..

రచన: Venu••5 నిమిషాల పఠనం

ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం గుజరాత్ అభివృద్ధికి సహకరించిందని.. అదే తరహా సహకారం తెలంగాణకు ఇప్పుడు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దేశంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య విభేదాల కంటే.. పరిస్థితి ఇప్పుడు గుజరాత్ వర్సెస్ దేశం అన్నట్టుగా మారుతోందని వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో అసోం దినపత్రిక ప్రతిదిన్ నిర్వహించిన ఇండియాస్ నెక్స్ట్ చాప్టర్ సదస్సులో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ అభివృద్ధి, ఎస్ఐఆర్, డీలిమిటేషన్, తన రాజకీయ ప్రస్థానం వంటి అంశాలపై మాట్లాడారు.

తెలంగాణకు రావాల్సిన కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్రం నుంచి తగిన సహకారం అందడం లేదన్నది రేవంత్ రెడ్డి ప్రధాన ఆరోపణ. రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు విస్తరణ, జాతీయ రహదారుల వంటి ప్రాజెక్టుల విషయంలో కేంద్రం వద్ద ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన అన్నారు. ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం గుజరాత్ అభివృద్ధికి సహకరించిందని.. అదే తరహా సహకారం తెలంగాణకు ఇప్పుడు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.

ఇక ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఎస్ఐఆర్‌పైనా సీఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ పేరుతో అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కోట్లాది ఓట్లు తొలగించారని ఆయన ఆరోపిస్తూ.. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ గో బ్యాక్ ఉద్యమం రావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం అధికారాలు కేంద్రీకృతమవుతున్నాయని కూడా విమర్శించారు.

అదే సమయంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. జనాభా ప్రాతిపదికన సీట్ల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రభావం పడొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత లోక్‌సభ సీట్ల సంఖ్యను మరికొంత కాలం కొనసాగించాలని సూచించారు.

మరోవైపు తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న రేవంత్ రెడ్డి.. 2006లో జెడ్పీటీసీగా, 2007లో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయాన్ని చెప్పారు. అనంతరం టీడీపీలో చేరి 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలిచానని, 2017లో కాంగ్రెస్‌లో చేరిన తర్వాత 2019లో ఎంపీగా ఎన్నికయ్యానని వివరించారు. కేసీఆర్ ప్రభుత్వంతో తన రాజకీయ పోరాటాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

అదేవిధంగా తాను రాహుల్ గాంధీని కలిసిన తర్వాత కాంగ్రెస్‌లో చేరానని, ఆయనే తన నాయకుడని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు.. ఇక రాహుల్‌ గాంధీకి వ్యక్తిగత ఎజెండా లేదని తెలిపిన రేవంత్ రెడ్డి.. ఆయన దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తారని కొనియాడారు. మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీకి పెద్దగా ప్రాధాన్యం లేదని, రాష్ట్రంలో కాంగ్రెస్‌దే ఏకపక్ష ఆధిపత్యమని స్పష్టం చేశారు.

#Telangana#revanth-reddy#New Delhi#gujarat#congress#pm Modi#sensational comments
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి