Spirituality

Spirituality: రోజులో ఏ వేళ ఏ దేవుడిని దర్శించాలి?..

రచన: Venu••4 నిమిషాల పఠనం

మనిషికి ఎదురయ్యే సమస్యలను తొలగించడంతో పాటు.. వాటిని ఎదుర్కొనే వివేకం, స్థిరమైన బుద్ధి, ధర్మబద్ధమైన ఆలోచనలను ప్రసాదించమని విష్ణువును ప్రార్థించడం ఈ ఆరాధనలోని అంతరార్థం.

మనిషి జీవితం కేవలం కాలంతో నడిచేది కాదు.. కాలాన్ని అనుసరించే ఒక ఆధ్యాత్మిక క్రమంతో నడుస్తుంది. అందుకే సనాతన ధర్మంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళలకు ప్రత్యేకమైన ప్రాధాన్యతను ఇచ్చారు. ప్రకృతిలో మారే ప్రతి దశను దైవతత్వంతో అనుసంధానించి.. ఆ సమయానికి తగిన సాధన, ఉపాసన, దేవతా ఆరాధనలను సూచించారు.

ఉదయే విష్ణుం, సాయాహ్నే తు మహేశ్వరం... కాలచక్రంలో ఉదయించే ప్రతి సూర్యకిరణం జగద్రక్షకుడైన శ్రీమహావిష్ణువు చైతన్యానికి సంకేతం. అందుకే ప్రాతఃకాలంలో ఆ వైకుంఠవాసుని దర్శిస్తే, రోజంతా సాగే జీవన యాత్రకు కావలసిన కార్యసిద్ధి, రక్షణ లభిస్తాయి. ఇక పగటి అశాంతి ముగిసి సమస్త లోకమూ ప్రశాంతత వైపు అడుగులేసే సాయంసంధ్య... సాక్షాత్తు ఆ ప్రదోష కాల మూర్తి అయిన పరమేశ్వరుని సన్నిధి..

ఆ సమయాన నందికేశ్వరుని కొమ్ముల మధ్య శివతాండవం తిలకించినా, ఆ నీలకంఠుని స్మరించినా సమస్త మానసిక తాపాలు శమిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. మరోవైపు శ్రీమహావిష్ణువు స్థితికారుడు. సృష్టిని ధర్మమార్గంలో నిలబెట్టే తత్వానికి విష్ణువు ప్రతీక. అందుకే సూర్యోదయంతో ప్రారంభమయ్యే రోజులో విష్ణుమూర్తిని స్మరించడం.. ఆ రోజు మన జీవన ప్రయాణం సక్రమంగా సాగాలని కోరుకోవడంగా భావిస్తారు.

మనిషికి ఎదురయ్యే సమస్యలను తొలగించడంతో పాటు.. వాటిని ఎదుర్కొనే వివేకం, స్థిరమైన బుద్ధి, ధర్మబద్ధమైన ఆలోచనలను ప్రసాదించమని విష్ణువును ప్రార్థించడం ఈ ఆరాధనలోని అంతరార్థం. ఇక సాయంత్రం సమయం ప్రకృతిలో మార్పునకు సంకేతం. పగటి కార్యక్రమాలు ముగిసి రాత్రి వైపు ప్రయాణం మొదలయ్యే వేళ.. పరమేశ్వరుని స్మరణకు ఎంతో విశిష్టమైనదిగా శైవ సంప్రదాయం చెబుతుంది.

అందుకే ఉదయం విష్ణు స్మరణతో జీవనానికి స్థిరత్వాన్ని కోరుకోవాలి.. సాయంత్రం శివస్మరణతో రోజంతా పేరుకున్న అశాంతిని విడిచిపెట్టాలి. ఇదే మన సనాతన ధర్మం చెప్పే దేవాలయ దర్శనం వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశం.

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.

#Spirituality#Lord Maha Vishnu#Lord Shiva#temple#morning#evening
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి