తెలంగాణ

Yadadri Bhuvanagiri: రూటు మారుతున్న భూ భారతి.. యజమానులకు తెలియకుండానే 7.18 ఎకరాలు మాయం!..

రచన: Venu•••7 నిమిషాల పఠనం

రికార్డుల్లో పేరు మారిన వ్యక్తి ఆ భూములను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అందుకే వివాదంలో ఉన్న సర్వే నంబర్లలో ఎలాంటి లావాదేవీలు జరగకుండా తక్షణమే బ్లాక్ చేయాలని.. అసలు యజమానుల పేర్లను తిరిగి నమోదు చేయాలని వారు కోరుతున్నారు.

భూ భారతి పోర్టల్‌లో భూముల వివరాలు ఆన్‌లైన్‌లో కనిపిస్తుంటే.. అదే వ్యవస్థలో తమ భూమి తమకు తెలియకుండానే వేరే వ్యక్తి పేరుపైకి మారిపోయిందని రైతులు ఆరోపించడం ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం రేపుతోంది. రాజాపేట మండలం చల్లూరు గ్రామంలో ముగ్గురు రైతులకు చెందిన సుమారు 7.18 ఎకరాల వ్యవసాయ భూమి.. ఎలాంటి విక్రయ లావాదేవీ లేకుండా, తమ ప్రమేయం లేకుండానే మరో వ్యక్తి పేరుపై పట్టా మారిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

రైతుల వివరాల ప్రకారం.. చల్లూరుకు చెందిన బింగి మల్లయ్యకు సంబంధించిన సర్వే నంబర్ 319లోని ఎకరం 32 గుంటల భూమి.. ఆయనకు తెలియకుండానే బింగి కరుణాకర్ పేరుపై నమోదైందని చెబుతున్నారు. అసలు భూమి విక్రయించలేదు.. రిజిస్ట్రేషన్ జరగలేదు.. స్లాట్ బుకింగ్ కూడా చేయలేదు.. అయినా రికార్డుల్లో మాత్రం పేరు ఎలా మారిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి..

ఇదే సమయంలో చల్లూరు రెవెన్యూ పరిధిలోని మరికొన్ని సర్వే నంబర్లలోనూ ఇలాంటి మార్పులు జరిగినట్టు రైతులు చెబుతున్నారు. సర్వే నంబర్ 402లో ఒక గుంటకు స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ జరిగినట్లు చెబుతుండగా.. అదే రోజున 329/ఇ2లో 4.06 ఎకరాలు, 319లో ఎకరం 32 గుంటలు, 108లో ఎకరం 20 గుంటల భూమి బింగి కరుణాకర్ పేరుపై పట్టాగా నమోదైనట్టు రైతులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా సుమారు 7.18 ఎకరాల భూమిపై ఈ మార్పులు జరిగాయని వారు చెబుతున్నారు.

తమ భూమి రికార్డుల్లో పేరు మారిన విషయం తెలుసుకున్న రైతులు ఆందోళనకు దిగారు. గ్రీవెన్స్ డే సందర్భంగా తహసీల్దార్‌ను కలిసి.. ఎలాంటి లావాదేవీ లేకుండా భూమి యాజమాన్యం ఎలా మారిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

అయితే.. ఈ మార్పులు తమ స్థాయిలో జరగలేదని, పైస్థాయిలో రికార్డుల్లో మార్పులు జరిగినట్టు తమకు సమాచారం ఉందని అధికారులు రైతులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారులకు ఇప్పటికే నివేదిక పంపించామని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ రవి కిరణ్ రైతులకు తెలిపినట్టు సమాచారం.

మరోవైపు రికార్డుల్లో పేరు మారిన వ్యక్తి ఆ భూములను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అందుకే వివాదంలో ఉన్న సర్వే నంబర్లలో ఎలాంటి లావాదేవీలు జరగకుండా తక్షణమే బ్లాక్ చేయాలని.. అసలు యజమానుల పేర్లను తిరిగి నమోదు చేయాలని వారు కోరుతున్నారు. అలాగే ఈ వ్యవహారంలో ఎవరైనా అధికారుల పాత్ర ఉంటే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక భూ రికార్డుల విషయంలో ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. తెలంగాణలో భూ రికార్డుల డిజిటలైజేషన్ లక్ష్యం పారదర్శకత, సులభమైన సేవలు, యాజమాన్య వివరాల భద్రతగా ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలోని వ్యవసాయ భూముల వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావడమే భూ రికార్డు వ్యవస్థ ప్రధాన ఉద్దేశం.

అయితే.. తెలంగాణ ఏర్పడిన 2014 తర్వాత కూడా భూ వివాదాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, రికార్డుల మార్పులపై ఆరోపణలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. 2026లో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలో 74 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణపై తెలంగాణ హైకోర్టు సీబీ-సీఐడీ విచారణకు ఆదేశించింది. అధికారుల కుమ్మక్కుపై వచ్చిన ఆరోపణలను కూడా కోర్టు పరిశీలించింది.

ఇక హైదరాబాద్‌లో ప్రభుత్వ, చెరువులు, రోడ్లు, పార్కుల భూములపై చర్యలు తీసుకుంటున్న హైడ్రాకు సంబంధించిన నివేదికల్లో.. 15 నెలల్లోనే వెయ్యి ఎకరాలకు పైగా ప్రభుత్వ, ప్రజా ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

అంటే.. ఒకవైపు లక్షలాది ఎకరాల భూమి రికార్డులు డిజిటల్ అవుతున్నాయి.. మరోవైపు చిన్న స్థాయిలో రికార్డు మార్పు జరిగినా అది రైతు జీవితాన్నే తలకిందులు చేసే పరిస్థితి కనిపిస్తోంది. భూ భారతి వంటి వ్యవస్థలో ఒక్క తప్పు ఎంట్రీ కూడా కోట్ల విలువైన ఆస్తిపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున.. రికార్డు మార్పులకు బాధ్యత ఎవరిది? ఆ మార్పు ఎలా జరిగింది? అసలు యజమానుల అనుమతి లేకుండా యాజమాన్య వివరాలు మారాయా? అనే అంశాలపై సమగ్ర విచారణ అవసరమనే డిమాండ్ వినిపిస్తోంది.

ఇక చల్లూరులో బయటపడిన 7.18 ఎకరాల వ్యవహారం.. కేవలం ముగ్గురు రైతుల సమస్యగా మిగిలిపోతుందా? లేక భూ రికార్డుల వ్యవస్థలోని లోపాలను బయటపెట్టే పెద్ద వ్యవహారంగా మారుతుందా? అన్నది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది.

#Telangana#Yadadri Bhuvanagiri#Bhu Bharati#7.18 acres Land Missing#Rajapeta#Challuru
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి