హైదరాబాద్ మహానగరంలో మరో తీవ్ర విషాదం నెలకొంది. ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక యువతి బలవన్మరణానికి పాల్పడింది. గత కొద్ది రోజులుగా సదరు యువతి డిప్రెషన్‌లో ఉన్నట్టు సమాచారం. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆమె లైఫ్ ఒక్కసారిగా అగాధంలోకి వెళ్లినట్టు బాధితురాలు ఫీల్ అయ్యేదని తెలిసింది. ఈ క్రమంలోనే మరణించిన తన ప్రియుడు కలలోకి వచ్చి తనను రమ్మంటున్నాడని కుటుంబీలకు చెప్పిన యువతి.. ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటన శంషాబాద్ పరిధిలోని సిద్ధార్థ కాలనీలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. శంషాబాద్‌లోని సిద్ధార్థ కాలనీకి చెందిన నర్మద.. నిజామాబాద్‌కు చెందిన సిద్ధార్థ్‌తో కొంతకాలంగా ప్రేమలో ఉంది.ఇటీవల సిద్ధార్థ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుండి నర్మద డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది.
ప్రియుడు లేని లోకంలో నేను ఉండలేనంటూ పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెకు నచ్చజెప్పగా.. సిద్ధార్థ్ కలలోకి వచ్చి తనను పిలుస్తున్నాడని తన అక్కకు చెబుతూ బాధితురాలు కన్నీరుమున్నీరు అయ్యింది. ప్రస్తుతం నర్మద తన అక్క ఇంట్లో ఉంటున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో నర్మద ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
విషయం తెలుసుకున్ను నర్మద తండ్రి ప్రియుడి మరణం తట్టుకోలేకనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు RGIA పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కూతురి మరణవార్త తెలిసి నర్మద కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అందజేయనున్నట్టు పోలీసులు తెలిపారు.


