తమ సమస్యలు పరిష్కరించడంతో పాటు డిమాండ్లు వినాలని గత కొన్నిరోజులు ఫార్మాసిటీ రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నిరంతరాయంగా న్యాయ పోరాటం చేస్తున్న రైతులు..ఇవాళ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఫార్మాసిటీ బాధిత రైతులు, రైతు కూలీలు, గ్రామ ప్రజలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఫార్మాసిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి భూమి సేకరించిన విషయం తెలిసిందే. గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నప్పటికీ పోలీసుల బలగాల సాయంతో బలవంతంగా రేవంత్ సర్కార్ భూసేకరణ పూర్తి చేసింది. అయితే, తమకు చెందిన 2500 ఎకరాల పట్టా భూమిని సైతం ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టిందని రైతులు ఆందోళనకు దిగారు. ఒప్పందం ప్రకారం తీసుకున్న భూమి కాకుండా తమకు చెందిన పట్టా భూములను ఎలా బ్లాక్ లిస్టులో పెడతారంటూ రైతులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే బ్లాక్ లిస్టు నుంచి రిలీజ్ చేయాలంటూ బాధిత రైతుల ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం నుంచి క్యాంపు ఆఫీస్ దగ్గర వేచి చూసినా అధికారులు స్పందించకపొవడంతో రోడ్డెక్కి నిరసన ప్రదర్శన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా రైతులను అరెస్టు చేసి తరలిస్తున్నారు. అంతకుముందు ప్రభుత్వం ఎదుట ఫార్మాసిటీ బాధిత రైతులు పలు డిమాండ్లు ఉంచారు.
రైతుల భూములు నిషేధిత జాబితాలో నుండి తొలగించి ఆన్‌లైన్‌లో చేర్చడంతో పాటు హైకోర్టు ఆర్డర్ ప్రకారం రైతు కూలీలకు న్యాయం చేయాలని కోరారు. అలాగే భూములు ఇచ్చిన రైతులందరికీ అసైన్‌మెంట్, పట్టా భూములకు ప్లాట్లు ఇవ్వాలని కోరారు.ఫార్మాసిటీ జీవో రద్దు చేయాలన్నారు. పై డిమాండ్లు పూర్తిగా అమలు అయ్యే వరకు తమ ఊర్లలో అన్ని పనులు నిలుపుదల చేయాలని షరతు విధించారు. కొత్త ప్రాజెక్ట్స్ గురించి ముందుగా ఊర్లలో ప్రజల అనుమతి తీసుకోవాలని స్పష్టంచేశారు.


