స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

కూకట్ పల్లిలో రూ.కోట్ల విలువైన భూ కుంభకోణం.. ఫోర్జరీ పత్రాలతో కుట్ర!

రచన: Mamatha puppala•••5 నిమిషాల పఠనం

హైదరాబాద్ నగర పరిధిలోని కూకట్ పల్లి గ్రామానికి చెందిన సర్వే నంబర్ 1007లోని సుమారు 349 ఎకరాల భూమి చుట్టూ తిరుగుతున్న వివాదం వెనుక కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న కుట్రలు, ఫోర్జరీ పత్రాల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. నవాబ్ ఫఖ్ర్-ఉల్-ముల్క్ కు చెందిన ఇర్రంనుమా ప్యాలెస్ ఆస్తుల్లో భాగమైన దాదాపు 1500 ఎకరాల విస్తీర్ణానికి నవాబ్ రైస్యార్ జంగ్ బహదూర్ వివాదరహిత యజమానిగా గుర్తింపు పొందారు.

  • కూకట్ పల్లి సర్వే నంబర్ 1007లో ద‌శాబ్దాలుగా భూవివాదం

  • వివాదానికి బీజంపోసిన‌ 1952 నాటి నకిలీ సేల్ డీడ్!

  • సహారా నుంచి ప్రైమ్ ప్రాపర్టీస్ వరకు..

  • అంతా రియల్ ఎస్టేట్ మాయాజాలం

  • న్యాయపోరాటం వెనుక అసలు నిజాలివే!

హైదరాబాద్ నగర పరిధిలోని కూకట్ పల్లి గ్రామానికి చెందిన సర్వే నంబర్ 1007లోని సుమారు 349 ఎకరాల భూమి చుట్టూ తిరుగుతున్న వివాదం వెనుక కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న కుట్రలు, ఫోర్జరీ పత్రాల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. నవాబ్ ఫఖ్ర్-ఉల్-ముల్క్ కు చెందిన ఇర్రంనుమా ప్యాలెస్ ఆస్తుల్లో భాగమైన దాదాపు 1500 ఎకరాల విస్తీర్ణానికి నవాబ్ రైస్యార్ జంగ్ బహదూర్ వివాదరహిత యజమానిగా గుర్తింపు పొందారు. 1960లో ఆయన మరణించిన అనంతరం చట్టబద్ధమైన వారసులకు పట్టా హక్కులు లభించగా, 1965-68 కాలంలో కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ (KHB) అభివృద్ధి కోసం ప్రభుత్వం 1110 ఎకరాలను సేకరించి వారసులకు పరిహారం చెల్లించింది.

భూసేకరణ ద్వారా వారసులకు భారీ పరిహారం అందడం గమనించిన కొంతమంది క్రిమినల్ ముఠా పక్కా పథకం ప్రకారం ఓ కుట్రకు తెరలేపారు. 1973 సమయంలో కారు మెకానిక్ షెడ్‌లో పనిచేసే మీర్ హాషిమ్ అలీ అనే నిరక్షరాస్యుడైన యువకుడిని తెరపైకి తెచ్చి, 1952 నాటి నకిలీ సేల్ డీడ్ (No. 707/1952) ను రికార్డు పుస్తకాల్లో చొప్పించి సృష్టించారు. నవాబ్ నమ్మకస్తుడైన వలి మొహమ్మద్ అనే వ్యక్తికి తేదీ లేని ఒక 'హిబా' (దానం) లభించిందని, అతని నుండి రెండేళ్ల మైనర్ మీర్ హాషిమ్ అలీ పేరిట ఈ భూమి కొనుగోలు చేసినట్లు చూపే ప్రయత్నం చేశారు. అయితే గౌరవ హైకోర్టు 16-03-1973 న ఇచ్చిన తీర్పులో వలి మొహమ్మద్‌కి ఎలాంటి టైటిల్ హక్కులు లేవని, హైదరాబాద్ టెనెన్సీ యాక్ట్ (1950) సెక్షన్ 47 ప్రకారం ఈ విక్రయం చట్టపరంగా చెల్లదని స్పష్టం చేసింది.

ఈ నకిలీ దానగ్రహీతలు, హాషిమ్ అలీ కలిసి 1974లో 'సహారా రియల్ ఎస్టేట్' పేరుతో భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేసి, ఆ తర్వాత 1984లో దీనిని "M/s Prime Properties" గా మార్చి రిజిస్టర్ చేయించారు. ఈ సంస్థ పక్కదారి పట్టిన కోర్టు ఉత్తర్వుల ఆధారంగా భూమి స్వాధీనం కోసం ప్రయత్నాలు చేయగా, 1984లో కోర్టు రిసీవర్‌ను నియమించడంతో ఈ భూమి ప్రస్తుతం కోర్టు ఆధీనంలో (custodia legis) ఉంది. ప్రైమ్ ప్రాపర్టీస్ లేదా శ్రీదేవి కాలనైజర్స్ కు ఎలాంటి యాజమాన్య హక్కులు లేవని సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా తెలుస్తోంది. 2012 తర్వాత తాను మోసపోయానని గ్రహించిన మీర్ హాషిమ్ అలీ ఎదురుతిరగడంతో, ఆయన మరణించే ముందు తనపై జరిగిన అక్రమాలు మరియు బలవంతపు సంతకాలపై వీడియో వాంగ్మూలం నమోదు చేశారు.

ప్రస్తుతం మొత్తం 349 ఎకరాల భూమిలో ఫ్లైఓవర్లు, రైల్వే స్టేషన్, రోడ్లు, ఆక్రమణలు పోగా నికరంగా 150 ఎకరాల వరకు మిగిలి ఉంది. నవాబ్ రైస్యార్ జంగ్ అసలైన వారసులు కొందరు ప్లాట్ల యజమానులతో సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉండగా, ప్రైమ్ ప్రాపర్టీస్ మాత్రం అడ్డదారుల్లో విలువైన భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోందని చట్టపరమైన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

#KukatpallyLandDispute#SurveyNo1007#HyderabadRealEstate#LandGrabCase#PrimeProperties#CourtCustodyLand#TelanganaNews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి