రోజు రోజుకు లోకంలో మానవతా విలువలు మంట కలిసిపోతున్నాయి.. మనిషి ప్రాణానికి, మహిళ భద్రతకు, తోటి వ్యక్తి గౌరవానికి విలువ తగ్గిపోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్ శివారులో జరిగిన ఓ క్యాబ్ ఘటన కూడా ఇదే ప్రశ్నను సమాజం ముందుంచుతోంది.
శంషాబాద్ సర్కిల్ పరిధిలో ఓ క్యాబ్ డ్రైవర్ ప్రయాణికురాలి భద్రతను విస్మరించి, ఆమెపై లైంగిక దాడికి యత్నించిన ఘటన కలకలం రేపింది. గచ్చిబౌలికి చెందిన 35 ఏళ్ల మహిళ ఆదివారం రాత్రి వ్యక్తిగత పనిమీద క్యాబ్‌లో ప్రయాణిస్తున్నారు. ఆమె వెంట రూ.60 వేల నగదు ఉన్న బ్యాగ్ కూడా ఉంది.
తొండుపల్లి టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్న తర్వాత.. డ్రైవర్ సాధారణ మార్గంలో వెళ్లకుండా, షార్ట్‌కట్ అంటూ వాహనాన్ని సర్వీస్ రోడ్డువైపు మళ్లించినట్లు పోలీసులు తెలిపిన వివరాల ఆధారంగా తెలుస్తోంది. అనంతరం కొత్వాల్‌గూడ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి కారును తీసుకెళ్లి ఆపి, మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అనూహ్య పరిణామంతో తీవ్ర భయాందోళనకు గురైన మహిళ.. ప్రాణభయంతో కారు నుంచి బయటకు వచ్చి గట్టిగా కేకలు వేశారు. దీంతో డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే వెళ్లే సమయంలో మహిళ వద్ద ఉన్న రూ.60 వేల నగదు బ్యాగ్‌ను తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితురాలు వెంటనే ఆర్‌జీఐఏ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు ఒక ప్రయాణికురాలు తనను సురక్షితంగా గమ్యస్థానానికి తీసుకెళ్తాడని నమ్మి ఎక్కిన వాహనంలోనే భయానక పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావడం ఆందోళన కలిగించే అంశం. ప్రజా రవాణా వ్యవస్థపై ఉండాల్సిన నమ్మకాన్ని ఇలాంటి ఘటనలు దెబ్బతీస్తాయి. మహిళలకు భద్రత కల్పించడం కేవలం పోలీసుల బాధ్యత కాదు.. ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత. వృత్తి ఏదైనా, ఎదుటి మనిషి గౌరవాన్ని గౌరవించడం కనీస మానవత్వం..


