తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. స్టడీ టూర్‌లో భాగంగా పలు దేశాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది. ఆయన వెంట పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం వెళ్లనున్నట్టు సమాచారం. ఇవాళ్టి నుంచి అక్టోబర్ 8 వరకు స్పీకర ప్రసాద్ పర్యటన కొనసాగనుంది. స్టడీ టూర్‌లో భాగంగా జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ దేశాల్లో స్పీకర్ బృందం పర్యటించనుంది.
అందులో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఆయన సతీమణి గుత్తా అరుంధతి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఆయన సతీమణి బండ అనితాప్రకాశ్, కౌన్సిల్ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు, అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి, స్పీకర్ ఓఎస్డీ వెంకటేశ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా ఆయా దేశాల్లోని పార్లమెంట్ హౌస్‌లను సందర్శించనున్నారు.అంతేకాకుండా, అక్కడి భారత రాయబార కార్యాలయాల సీనియర్ అధికారులతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది.
మధ్యాహ్నం 1:15 గంటలకు జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు చేరుకోనున్నట్లు స్పీకర్ బృందం చేరుకుంటుందని సమాచారం. అక్కడ వీరిని రిసీవ్ చేసుకోవడానికి ప్రభుత్వం తరఫున అధికారులు,కాంగ్రెస్ ఫాలోవర్స్ రానున్నట్టు సమాచారం. ఇదిలాఉండగా, అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రభుత్వం తరఫున స్టడీ టూర్ చేపట్టినట్టు తెలుస్తోంది. ఆయా దేశాల్లో ప్రభుత్వ పనితీరు, చట్టాల అమలు, జవాబుదారితనం, పాలనలో పారదర్శకత, పోలీసింగ్, ఎడ్యుకేషన్ వంటి అంశాలపై స్టడీ టూర్ కొనసాగనుందని సమాచారం.
పర్యటన అనంతరం స్పీకర్ బృందం స్టడీ చేసిన అంశాలను ఇక్కడి ప్రభుత్వానికి వివరించనున్నారు. అందులోని కీలక అంశాలను రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేయనున్న సంక్షేమం, పాలనా విధానంలో అమలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వంలోని పెద్దలు ఇలా విదేశాల్లో స్డడీ టూర్‌కు వెళ్లడం ఇదేమి కొత్త కాదు. గత ప్రభుత్వాల్లోనూ ఇలాంటి అధ్యయనాలు జరిగాయి. కాగా, గడ్డం ప్రసాద్ కుమార్‌కు వచ్చే కేబినెట్ విస్తరణ లేదా పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి పదవి రానుందని కాంగ్రెస్ పార్టీలోనే జోరుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త స్పీకర్ ఉంటారని, గడ్డం ప్రసాద్ కేబినెట్ హోదాతో అసెంబ్లీలో అడుగుపెడతారని టాక్.


