నిద్రించే సమయంలో ఫోన్‌ను దిండు కింద పెట్టుకోవడం చాలామందికి అలవాటుగా మారింది. అలారం కోసం కావొచ్చు.. వెంటనే నోటిఫికేషన్లు చూసేందుకు కావొచ్చు.. ఫోన్‌ను మాత్రం తలకు అతి దగ్గరగా పెట్టుకుని నిద్రించే పద్ధతి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా ఫోన్‌ను దిండు కింద పెట్టుకుని ఛార్జింగ్ చేయడం మరింత ప్రమాదకరం. దిండు, దుప్పటి వంటి వస్తువులు ఫోన్ చుట్టూ వేడిని బయటకు వెళ్లకుండా అడ్డుకుంటాయి. దీంతో పరికరం అధికంగా వేడెక్కే అవకాశం ఉంటుంది. బ్యాటరీ దెబ్బతినడంతో పాటు, అరుదైన సందర్భాల్లో బ్యాటరీలో సమస్యలు తలెత్తి అగ్ని ప్రమాదానికి కూడా దారితీయవచ్చు. అందుకే ఛార్జింగ్‌లో ఉన్న ఫోన్‌ను ఎప్పుడూ దిండు కింద లేదా మంచం మీద పెట్టకూడదని అంటున్నారు.
మరోవైపు మొబైల్ ఫోన్ నుంచి రేడియోఫ్రీక్వెన్సీ రేడియేషన్ వెలువడుతుంది. అయితే సాధారణ మొబైల్ ఫోన్ వినియోగం వల్ల క్యాన్సర్ లేదా మెదడు కణితులు వస్తాయని ఖచ్చితంగా నిరూపించబడలేదు. అయినప్పటికీ, రాత్రంతా ఫోన్‌ను తలకు ఆనించి ఉంచాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నిద్రకు ముందు ఎక్కువసేపు ఫోన్ చూడటం వల్ల స్క్రీన్ వెలుతురు, నోటిఫికేషన్లు నిద్రకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
అందుకే నిద్రపోయే సమయంలో ఫోన్‌ను దిండు కింద పెట్టే అలవాటును మానుకోవడం మంచిది. అలారం అవసరమైతే ఫోన్‌ను మంచానికి కొంచెం దూరంలో ఉన్న టేబుల్‌పై ఉంచండి. ఛార్జింగ్ సమయంలో ఫోన్ చుట్టూ గాలి ప్రసరణ ఉండేలా చూసుకోండి. చిన్న జాగ్రత్తే అయినా.. నిద్ర నాణ్యతతో పాటు ఇంటి భద్రతకూ ఉపయోగపడుతుంది.
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..


